జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఆయన అన్న చిరంజీవే శాపమని అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం అనేది ఆయన చేసిన అతిపెద్ద తప్పిదమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే పవన్ కళ్యాణ్ సినిమాల్లో కష్టపడి పైకొచ్చారని.. కానీ రాజకీయ రంగంలో విత్తనాలు వేసినంత మాత్రాన పంటలు పండడం అసాధ్యమని దివాకరరెడ్డి తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో తాను కూడా ఎంపీ పదవికి పోటీ చేయనని.. ప్రస్తుతం ఎంపీలకు పార్లమెంటులో చేయడానికి పనే ఉండడం లేదని.. వారు కరివేపాకుల్లా మారిపోయారని ఆయన తెలిపారు. అయితే తాను పోటీ చేయకపోయినా.. చంద్రబాబు అవకాశమిస్తే.. తన కుమారుడిని పోటీలోకి దింపే యోచనలో ఉన్నట్లు దివాకరరెడ్డి తన మనసులో మాట బయటపెట్టారు.