Pawan Kalyan Slams AP Govt: అకాల వర్షాలతో పంట నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని, ఆఖరి గింజకొనే వరకు రైతు తరఫున పోరాటం చేస్తామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. అన్నం పెట్టే అన్నదాత కన్నీరు రాష్ట్రానికి క్షేమం కాదని.. రైతుల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం చిత్తశుద్ధితో వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నుంచి వ్యవసాయ శాఖ మంత్రి, అధికార యంత్రాంగం త్రికరణశుద్ధితో పని చేయకపోవడం వల్లే రాష్ట్రంలో రైతులకు ఈ పరిస్థితి దాపురించిందని అన్నారు. గురువారం ఉదయం రాజమండ్రిలో నూతనంగా ప్రారంభించిన పార్టీ ప్రాంతీయ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
"ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రైతాంగ సమస్యలపై ఎన్నికల తరువాత కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష చేపట్టాం. వారికి మరింత అండగా ఉండాలనే ఉద్దేశంతో రాజమండ్రి కేంద్రంగా ప్రాంతీయ కార్యాలయం ప్రారంభించాం. నిన్న క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల పడుతున్న కష్టాలు, ఇబ్బందులు కళ్లారా చూశాను. ఇప్పుడు కూడా వివిధ నియోజక వర్గాల నుంచి వచ్చిన రైతులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యాను. అకాల వర్షాలతో ధాన్యం తడిచిపోయి మొలకలు వచ్చేశాయి. ఎకరాకు రూ.35 నుంచి రూ.40 వేలు పెట్టుబడిగా పెట్టినా కనీసం గిట్టుబాటు ధర రావడం లేదు. కొన్న ధాన్యానికి కూడా ఎప్పుడు డబ్బులు చెల్లిస్తారో తెలియని పరిస్థితి గత మూడేళ్లుగా చూస్తున్నాం. నాలుగైదు నెలలకు డబ్బులు చెల్లించినా బ్యాంకుల నుంచి ఒకేసారి తీసుకునే పరిస్థితి ఉండటం లేదు. ఒకప్పుడు పాడి పంటలతో పచ్చగా ఉన్న గోదావరి జిల్లా రైతులు ఇప్పుడు కన్నీరు పెడుతున్నారు.
ఆరుగాలం పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం స్థానిక ప్రభుత్వ కార్యాలయం వద్ద నిరసన తెలిపి, వినతి పత్రం ఇద్దామని వెలుతున్న రైతులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్‌లో కూర్చొబెట్టి రాత్రికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపుతున్నారు. అన్నం పెట్టే రైతుకు అండగా నిలబడే విధానం ఇదైతే కాదు. ఎవరైనా ప్రతిపక్ష నాయకులు పంట నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వస్తున్నారని తెలియగానే రాత్రికి రాత్రి బస్తాలు ఇచ్చి ధాన్యం పొలాల నుంచి తరలిస్తున్నారు. ఆ పని ముందెందుకు చేయడం లేదు. రైతులకు ముందే గోనె సంచులు ఇస్తే ఈ రోజు ఈ పరిస్థితి దాపురించేంది కాదు. ఎవరైనా వచ్చి ఒత్తిడి తెస్తే తప్ప పరిస్థితి మారడం లేదు. రైతులు కూడా మాకు రుణమాఫీలు అవసరం లేదు. ప్రతి పంటకు ముందు పావల వడ్డీతో రూ.20 వేలు పెట్టుబడి అందిస్తే చాలు ఎవరి మీదా ఆధారపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఆ దిశగా ఆలోచనలు చేయండి.." అని పవన్ కళ్యాణ్ సూచించారు.
సమస్యలు చెప్పుకొన్న రైతులపై మంత్రులుగానీ, ఎమ్మెల్యేలుగానీ, అధికారులుగానీ వేధింపులకు పాల్పడినా.. దాడులు చేసినా తీవ్ర పరిణామామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జనసేనాని హెచ్చరించారు. రైతులు తమ గోడు చెప్పుకున్నారని.. వాళ్లకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు. వీలైతే వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికి ప్రయత్నించాలని.. అంతే తప్ప వారిపై కేసులు పెట్టి వేధిస్తే మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు.
Also Read: Bandi Sanjay: మాటలు కోటలు దాటుతాయ్.. ఇప్పటికీ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు: బండి సంజయ్
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ పెంపుతోపాటు ఈ బెనిఫిట్స్ అమలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook