జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి గుంటూరు పర్యటనకు సిద్ధమవుతున్నారు. మార్చి రెండో వారంలో గుంటూరులో డయేరియా వ్యాధి సోకిన కారణంగా 14 మంది మృతి చెందిన సందర్భంలో మార్చి 16వ తేదీన గుంటూరులో పర్యటించిన పవన్ కల్యాణ్.. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కారణంగానే ఈ దుర్ఘటన జరిగినట్టు అక్కడి నుంచే ఏపీ సర్కార్‌ని తీవ్రంగా ఎండగట్టిన సంగతి కూడా తెలిసిందే. అంతేకాకుండా 48 గంటల్లో బాధితులకు సాంత్వన చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే, తన జనసేన పార్టీ గుంటూరు బంద్‌కి పిలిపునివ్వడమే కాకుండా స్వయంగా తానే వచ్చి ఆ బంద్‌లో పాల్గొంటానని ఆ పర్యటనలో ఏపీ సర్కార్‌కి అల్టీమేటం కూడా జారీచేశారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఏప్రిల్ 4న గుంటూరు పర్యటన వెళ్లనున్నట్టు పవన్ పార్టీవర్గాలు చెబుతున్నాయి. డయేరియా వ్యాధి కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలని పరామర్శించి వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందిందో తెలుసుకోనున్నారు పవన్.
డయేరియా వ్యాధి సోకి దాదాపు 200 మంది ఆస్పత్రులపాలైనట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే, ఆ బాధితులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి వైద్య సహాయం అందింది అనే విషయాన్ని కూడా పవన్ ఈ పర్యటనలో ఆరా తీయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ బాధితులకు ఇంకా న్యాయం జరగకపోతే తాను స్వయంగా బంద్ చేపట్టనున్నట్టు ప్రకటించిన పవన్ మళ్లీ గుంటూరు వెళ్తున్నారంటే, ఈసారి అక్కడి పరిస్థితిని చూసిన తర్వాత తాను సంతృప్తి చెందనట్టయితే, అక్కడే ఆయన బంద్ కి పిలుపునిస్తారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.