అమరావతి: 'మన భవితకు ప్రాణాధారమైన మాతృ భాషను కాపాడుకోకపోతే సంస్కృతికి దూరమవుతామ'ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. నాగరికతకు పుట్టినిల్లయిన నదులను విషమయం చేసుకోవడం బాధాకరమన్నారు. మాతృ భాషను, నదులను పరిరక్షించుకొనే దిశగా 'మన నుడి... మన నది' కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ విషయమై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ "నాగరికతకు పుట్టినిల్లు నది. నది లేనిదే సంస్కృతి లేదు. నది నశించాక ఆ సంస్కృతి మిగలదు. దీనికి చరిత్రలో కావలసినన్ని రుజువులున్నాయి. నాగరికతకు అమ్మ ఒడి నుడి. భాష లేనిదే సంస్కృతి లేదు. మాతృభాష గతించాక సంస్కృతి మిగలదు. దీనికి చరిత్రలో బోలెడు రుజువులు కనిపిస్తాయి. మన మనుగడకు జీవనాధారమైన నదులను మనం చేతులారా విషమయం చేస్తున్నాం. మన భవితకు ప్రాణాధారమైన అమ్మనుడికీ మనం అతివేగంగా దూరమవుతున్నాం. మాతృ భాష మూలాలను మనమే నరికేసుకుంటున్నాం అని పేర్కొన్నారు.
మన నుడిని, మన నదిని కాపాడుకోవాలి. అందుకే విజ్ఞులు, మేధావులతో ఈ అంశంపై చర్చించాం. మాతృ భాషను పరిరక్షించుకోవాలి. మన నదులను కాపాడుకోవాలి. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలవారినీ భాగస్వాముల్ని చేసేలా “మన నుడి... మన నది” కార్యక్రమం చేపడుతున్నాం. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామ'ని తెలిపారు.
మరో కొత్త పోరాటానికి తెరతీసిన పవన్ కళ్యాణ్