Nara Lokesh On IT Jobs: గత ప్రభుత్వంలో కొందరు ఐటి కంపెనీల్లో కూడా వాటాలు అడగడంతో వారు రాష్ట్రం విడిచి వెళ్లిపోయారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖలో ఐటీ పరిశ్రమ అభివృద్ధిపై శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, ఈశ్వరరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు. "రాష్ట్ర విభజన తర్వాత ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అనే నినాదంతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకెళ్లారు. అందులో భాగంగా విశాఖలో ఐటి పరిశ్రమ అభివృద్ధికి కృషిచేశారు. నేడు ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో 20 శాతం మంది తెలుగువారు ఉండటం హర్షణీయం. 2014-19 నడుమ రాష్ట్రానికి దాదాపు 150 కంపెనీలు రావడంతో 50 వేల మందికి ఉపాధి లభించింది. డాటా సెంటర్ను రప్పించేందుకు అప్పట్లో అదానీతో ఒప్పందం చేసుకున్నాం.
విశాఖలో ఐటీ రంగం ప్రముఖులతో కాంక్లేవ్ పెట్టాం. ఐటీ రంగంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న తరుణంలో గత ప్రభుత్వం చర్యలతో బ్రేక్ పడింది. గతప్రభుత్వంలో ఒక మంత్రి కోడిగుడ్డు కథలతో రాష్ట్రాన్ని నవ్వుల పాల్జేశారు. ఇదివరకెన్నడూ లేనివిధంగా ఐటి కంపెనీల్లో వాటాలడిగారు. నాటి ప్రభుత్వ అనాలోచిత చర్యలతో నిక్సీ, ఎస్ టిబిఐ వెళ్లిపోయాయి. ఫలితంగా ఎపి యువత నష్టపోయింది. గత అయిదునెలల్లో ఐటి కంపెనీలు, ఐటా ప్రతినిధులతో మాట్లాడాను.
తమ కృషి ఫలితంగా త్వరలో విశాఖకు టిసిఎస్ రాబోతోంది. మూడు నెలల్లో టీసీఎస్ విశాఖలో టిసిఎస్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. దీంతోపాటు విశాఖలో క్యాంపస్ ఏర్పాటుకు కూడా వారు ఒప్పకున్నారు. ఇన్ఫోసిస్ సంస్థను కూడా క్యాంపస్ ఏర్పాటు చేయాలని కోరా. ఇందుకు అవసరమైన భూముల కోసం వెదుకుతున్నాం. ఆరు నెలల్లో కొబ్బరికాయ కొడతాం. ముఖ్యంగా ఐటి పరిశ్రమలు రావడానికి అవసరమైన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఐటి రంగంలో రాబోయే 5ఏళ్లలో 5లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నాం.
ఇటీవల తాను యుఎస్ పర్యటనకు వెళ్లి పలువురు డాటా సెంటర్ల అధినేతలతో మాట్లాడాను. 2019-24 నడుమ డాటా సెంటర్లపై ఎటువంటి ఫోకస్ పెట్టలేదు. దాంతో ఆయా సంస్థలు ముంబయ్, తమిళనాడు, తెలంగాణాకు వెళ్లిపోయాయి. సరైన పాలసీతో ముందుకు వెళ్లుంటే విశాఖ డాటా సెంటర్ క్యాపిటల్ అయ్యేది. ఈ రంగంలో ప్రతిఏటా 300 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తున్నాయి, అందులో వంద బిలియన్ డాలర్లు ఎపికి తేవాలన్నది నా లక్ష్యం. నేను డాటా సెంటర్ కంపెనీలతో మాట్లాడినపుడు వారు పలు సమస్యలను నా దృష్టికి తెచ్చారు. ముఖ్యంగా డేటా సెక్యూరిటీ, టాక్సేషన్, డాటా ఎంబసీలపై కేంద్రస్థాయిలో పాలసీ ఫ్రేమ్ వర్క్ చేయాల్సి ఉంది, దీనిపై కూడా చర్చలు జరుపుతున్నాం. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ పనులు శరవేగంతో ముందుకు రాగుతున్నాయి.
సోషల్ ఎకో సిస్టమ్ ఏర్పాటులో భాగంగా భారత్ లోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ త్వరలో విశాఖకు రాబోతోంది. దీంతోపాటు వేలాదిగా హోటల్స్ కూడా రావాల్సి ఉంది. ఇటీవలే టూరిజంను ఇండస్ట్రీగా గుర్తించే పాలసీ తెచ్చాం. నేను రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఐటిలో ఉన్న టాప్ 100 కంపెనీలతో ప్రాథమిక చర్చలు జరిపా, ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఆయా సంస్థలను విశాఖకు రప్పిస్తాం. ఫార్చ్యూన్ 500 కంపెనీలు గ్లోబల్ డెలివరీ సెంటర్ల (జిసిసి) ఏర్పాటుకు కొత్త పాలసీ తేవాల్సి ఉంది. దీనిపై కసరత్తు ప్రారంభించాం, వచ్చేనెలలో పాలసీ తెస్తాం. విశాఖలో గ్రేడ్ ఎ ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి తేవాల్సి ఉంది. ఇందుకోసం రియల్ ఎస్టేట్ డెవలపర్స్ తో కూడా చర్చిస్తున్నాం. డేటా సెంటర్ పాలసీ - అవుట్ రీచ్ – సోషల్ ఎకో సిస్టమ్ కోసం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నాం. ఐటి కంపెనీలకు సంబంధించి ఇన్సెంటివ్స్ పెండింగ్ లో ఉన్నాయి, ఇందుకోసం ఇటీవల బడ్జెట్ 500 కోట్లు కేటాయించారు. సాధ్యమైనంత త్వరలో బకాయిలు క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
వివిధ సంస్థలు తమ యూనిట్లు ఏర్పాటు చేసే క్రమంలో ఒకనెల లేట్ అయినా తమ అంచనాలు తారుమారు అవుతాయని టాటా చైర్మన్ చంద్రశేఖరన్ చెప్పారు. అటువంటి సమస్యలు తలెత్తకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై ఫోకస్ పెట్టాం. పరిశ్రమలకు సంబంధించిన అనుమతులకు సంబంధించి ప్రతివారం ఫాలో అప్ చేస్తున్నాం. రిలయన్స్ బయో ఇంధన సంస్థ 700 యూనిట్లు రాష్ట్రంలో ఏర్పాటుచేసేందుకు ముందుకు వచ్చింది. రాష్ట్రానికి రావడానికి ఆసక్తి కనబర్చే ఐటి సంస్థలతో పరిచయం ఉన్న ఎమ్మెల్యేలు, ఉన్నతస్థాయిలో ఉన్న తెలుగువారు తనకు తెలియజేస్తే వారితో చర్చలు జరపడానికి ఎక్కడికి వెళ్లడానికైనా నేను సిద్ధంగా ఉన్నా.
అందరం కలసికట్టుగా మనందరం పనిచేసి రాబోయే అయిదేళ్లలో ఐటి రంగంలో 5లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని సాధిద్దాం. ఒకసారి భారీఎత్తున ఐటి పరిశ్రమలు విశాఖకు వస్తే ఏ ప్రభుత్వం వచ్చినా తర్వాత ఏమీ చేయలేదు. టైర్-2, టైర్ -3 సిటీలకు కో వర్కింగ్ స్పేస్ ఇచ్చి ఐటి కంపెనీలను రప్పించే విషయంపై కూడా ముఖ్యమంత్రితో చర్చిస్తున్నాం. నేను మంత్రి అయ్యాక అదానీ డేటా సెంటర్ ఏర్పాటుపై ఆ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపాను.
నేషనల్ లెవల్ డాటా పాలసీ వస్తే రాష్ట్రానికి పెద్దఎత్తున డాటా పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయి. ఇందుకోసం ఐటి హిల్స్ పై భూముల కేటాయింపునకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. రాబోయే 3నెలల్లో కనీసం రెండు డాటా కంపెనీలు విశాఖకు వచ్చే అవకాశముంది. డాటా సెంటర్ల ఏర్పాటుకు ముఖ్యంగా సింగపూర్ నుంచి సి ల్యాండింగ్ కేబుల్ రావాల్సి ఉంది. దీనితోపాటు నిక్సీని కూడా విశాఖకు రప్పించడానికి కృషిచేస్తాం.." అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.