సినీనటుడు మోహన్ బాబు వైసీపీలో చేరుతున్నారన్న వార్తలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా ఛానల్స్‌లో కోడై కూస్తున్నాయి. అయితే ఈ విషయంలో నిజంలేదని కూడా కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ వార్త బయటకు రావడానికి కూడా ఓ ఘటన కారణమైంది. శనివారం సాయంత్రం రాజ్యసభ సభ్యుడు, వైసీపీ నేత విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తిరుపతిలో మోహన్ బాబుని కలిశారు. ఇటీవలే మోహన్ బాబు తల్లి మంచు లక్ష్మమ్మ మరణించిన సంగతి తెలిసిందే. ఆమె చిత్రపటానికి వైసీపీ నేతలు నివాళులు అర్పించారు.
ఆ తర్వాత ఆయనతో పిచ్చాపాటి మాట్లాడి వెళ్లిపోయారు. ఆ తర్వాతే ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీకి మోహన్ బాబు విరివిగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. తర్వాత ఆయన రాజ్యసభ సభ్యులుగా కూడా పనిచేశారు. తర్వాత ఆయన నెమ్మదిగా తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు తన విద్యాసంస్థ అయిన శ్రీ విద్యానికేతన్ బాధ్యతలు చూసుకుంటున్నారు.
అయితే గతకొంతకాలంగా మోహన్ బాబు రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో అయితే కేసీఆర్‌కి, టీఆర్ఎస్‌కి మోహన్ బాబు బహిరంగంగానే మద్దతు పలికారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆయన ఇక్కడి నుండి మళ్లీ పోటీ చేస్తారని.. చిత్తూరు నుండి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం ఉందని కొన్ని పత్రికలు వార్తలు రాశాయి. పైగా వైఎస్ రాజశేఖరరెడ్డి తమ్ముడి కూతురును మోహన్‌బాబు తనయుడు విష్ణుకు ఇచ్చి పెళ్లి చేయడంతో ఆయన జగన్‌కు అండగా నిలబడతారన్న వార్తలు కూడా వచ్చాయి. ఒకానొక సందర్భంలో అయితే మోహన్‌బాబు కుమార్తె లక్ష్మి చంద్రగిరి నుంచి పోటీ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. ఏదేమైనా.. నిన్న విజయసాయిరెడ్డి, మోహన్ బాబుతో కలిసి మాట్లాడడంతో మళ్లీ కలెక్షన్ కింగ్ రాజకీయ రీఎంట్రీ టాపిక్ ప్రచారంలోకి వచ్చింది.
సినీనటుడు మోహన్ బాబు వైసీపీలో చేరుతున్నారా..?