Pawan Kalyan Speech: సీఎం కావడానికి నేను సంసిద్ధం.. తల తెగినా మాటకు కట్టుబడి ఉంటా: పవన్ కళ్యాణ్

Pawan Kalyan Varahi Yatra: తాను ఎన్నికల ముందు అది చేస్తా.. అన్నీ ఇచ్చేస్తా.. అని చెప్పనని తాను చేసేది మాత్రమే అన్నీ ఆలోచించి చెప్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. తాను ఒకసారి మాట ఇచ్చిన తర్వాత తల తెగినా దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. సినిమాలు వేరు.. రాజకీయం వేరు అన్న జనసేనాని.. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, చిరంజీవి ఇలా అందరి హీరోలు అభిమానులు ఆలోచించి ఓట్లు వేయాలని రిక్వెస్ట్ చేశారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Jun 17, 2023, 05:49 AM IST
Pawan Kalyan Speech: సీఎం కావడానికి నేను సంసిద్ధం.. తల తెగినా మాటకు కట్టుబడి ఉంటా: పవన్ కళ్యాణ్

Pawan Kalyan Varahi Yatra: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రి స్థానం తనకు ఇవ్వగలిగితే శ్రీపాద శ్రీ వల్లభుడు పుట్టిన నేల సాక్షిగా చెబుతున్నాను.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. దశాబ్దం తర్వాత అన్ని అంశాల మీద పూర్తి అధ్యయనం చేసి, సంపూర్ణ అవగాహనతో ఈ మాట చెబుతున్నానని తెలిపారు. రాష్ట్ర బాధ్యత తీసుకోవడానికి తాను సంసిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పిఠాపురాన్ని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. వారాహి విజయ యాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం పిఠాపురంలో జనసేనాని మాట్లాడారు. 

రాష్ట్రంలో ఎంత గొడవలు జరిగితే వైసీపీ అంత లాభపడుతుందనేది వైసీపీ నాయకుడి గేమ్ ప్లాన్ అని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడి పిఠాపురం నుంచే మొదలయ్యాయని.. 219 హిందూ ఆలయాల మీద దాడులు, విగ్రహాల ధ్వంసం సంఘటనలు జరిగితే ఒక్కరిని కూడా వైసీపీ ప్రభుత్వం పట్టుకోలేదని విమర్శించారు. దీని వెనుక చచ్చు ముఖ్యమంత్రి ఆలోచన దాగుందని.. వైసీపీ నాయకుల కుట్ర దాగుందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ నేరాలకు అడ్డా అయిపోయిందని.. జనసేన ప్రభుత్వంలో ‘‘సురక్ష ఆంధ్రప్రదేశ్’’ను సాధించి తీరుతామన్నారు. 

"గత నాలుగేళ్లలో రాష్ట్రంలో శాంతిభద్రతలను నాశనం చేశారు. పోలీసుశాఖను నిర్వీర్యం చేశారు. వైసీపీ నాయకులు చెప్పిందే చట్టం... వేసిందే శిక్ష అన్నట్లు పరిస్థితి తయారైంది. పోలీసులపై పూర్తిస్థాయిలో వైసీపీ ఒత్తిళ్లు ఉన్నాయి. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకూ ఒత్తిళ్లు పనిచేస్తున్నాయి. సున్నితమైన అంశాల్లో సైతం పోలీసులు వైసీపీ నేతల ఒత్తిళ్ల వల్ల ముందుకు వెళ్లలేకపోతున్నామని చెబుతున్నారు.  

రాజధాని లేని ఆంధ్రప్రదేశ్‌ను గంజాయికి దేశ రాజధానిగా వైసీపీ మార్చింది. రాష్ట్రం నుంచి రవాణా అవుతున్న గంజాయి దేశంలోనే అధికం. ఆంధ్రప్రదేశ్ గంజాయి మత్తులో తూగేలా తయారు చేశారు. మన్యంలో విపరీతంగా గంజాయి పడుతుంటే, దాన్ని రవాణా చేసి లాభపడుతోంది వైసీపీ నాయకులు. జనసేన ప్రభుత్వంలో నిజాయతీ గల పోలీసు అధికారులకు స్వేచ్ఛగా వారి విధులను నిర్వర్తించేలా అధికారం కట్టబెడతాం. పోలీసులు వారి విధులను ఎలాంటి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు గురి కాకుండా చేస్తే సమాజం అద్భుతంగా తయారవుతుంది. 

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో దోపిడీ ఇష్టారాజ్యం అయిపోయింది. శ్రీవాణి ట్రస్టు అని దర్శనం కోసం పెట్టారు. రూ.10 వేలు కడితే దర్శనం ఉంటుంది. అయితే కట్టిన డబ్బుకు బిల్లు ఉండదు. కేవలం రూ.వెయికి మాత్రమే టిక్కెట్ కేటాయించినట్లు లెక్కలుంటాయి. మిగిలిని రూ.9 వేలు ఎక్కడికి వెళ్తున్నాయో తెలీదు. ఏడుకొండల స్వామితో ఆటలాడుతున్నారు. నామరూపాలు లేకుండా పోతారు జాగ్రత్త. హిందూ ఆలయాలు, వాటి ఆస్తుల మీద వైసీపీ ప్రభుత్వం కన్నేసింది. దేవాదాయశాఖను నిర్వీర్యం చేసి, కేవలం ఆలయాల వద్ద ఉన్న ఆస్తులను కాజేయడానికి ఈ ప్రభుత్వం చూస్తోంది. పిఠాపురం ఆధ్యాత్మిక శోభ ప్రాంతం. దీన్ని ఆధ్యాత్మిక రాజధానిగా తీర్చిదిద్దుతాం..

మొన్న అన్నవరం శ్రీ సత్యదేవుడి దర్శనానికి వెళ్లినపుడు నాకు ఎంతో ఇష్టమైన రెండు చెప్పులను ఎవరో కొట్టేశారు. ఆ తర్వాత నాకు ఎవరో చెప్పారు. మీ చెప్పులు టీవీలో ఓ వ్యక్తి చేతిలో కనిపించాయి అని.. ఆ చెప్పులంటే నాకు చాలా ఇష్టం. దయచేసి ఆయన దగ్గర తీసుకొని, నా చెప్పులు నాకు ఇప్పించండి. ఇలా వైసీపీ నాయకులు చెప్పులను కూడా కాజేస్తే ఎలా..? దయచేసి ఆ చెప్పులు మాత్రం మర్చిపోకుండా ఇప్పించండి. గుళ్లలో చెప్పులు కూడా పట్టుకుపోయేలా ఈ నాయకులు తయారయ్యారు.." అని పవన్ కళ్యాణ్ విమర్శించారు. 

జనసేన అధికారంలోకి రాగానే ప్రతి నియోజకవర్గంలో ఏటా 500 మంది యువతను ఎంపిక చేసి.. వారు వ్యాపారం పెట్టుకునేలా రూ.10 లక్షల మేర ఆర్థిక సాయం చేస్తామన్నారు. వారు పదిమందికి ఉపాధి కల్పించేలా వాళ్లను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ సీఎం ఎన్నికల ముందు అన్నట్లు నన్ను ముఖ్యమంత్రిని చేయండి.. అది చేసేస్తా.. అన్నీ ఇచ్చేస్తా.. అని చెప్పను అని.. తాను చేసేది మాత్రమే అన్నీ ఆలోచించి చెప్తానని అన్నారు. మాట ఇచ్చిన తర్వాత తల తెగినా దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. సినిమాలు వేరు.. రాజకీయం వేరు అని.. తనకు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, చిరంజీవి ఇలా అందరి హీరోలు ఇష్టమేనని అందరి అభిమానులు ఆలోచించి ఓట్లు వేయాలని కోరారు. తాను ఒక్క సినిమా చేస్తే దాదాపు 500 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. భీమ్లా నాయక్, వకీల్ సాబ్ వంటి చిత్రాలు చేయబట్టే ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను ఆదుకోగలిగానని చెప్పారు. ఒక్కసారి నిజాయతీనే నమ్ముకున్న జనసేనను ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు.

Also Read: Adipurush Review: ఆదిపురుష్ మూవీ రివ్యూ.. ఆధునిక రామాయణం ఎలా ఉందంటే..?  

Also Read: TS Gurukul Recruitment 2023: అభ్యర్థులకు ముఖ్యగమనిక.. 9,231 ఉద్యోగ ఖాళీలకు పరీక్షలు ఎప్పుడంటే..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News