గూటి నుంచి బయటకు వెళ్లిన పక్షి మళ్లీ అదే గూటికి చేరినట్లు... నాలుగేళ్ల క్రితం కాంగ్రెస్ ను వీడిన కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి ఆ పార్టీలో చేరారు. శుక్రవారం మధ్యహ్నం ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ సమక్షంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఉమెన్ చాందీతో పాటు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిలు, మాజీ కేంద్ర మంత్రి పళ్ళంరాజు ఉన్నారు. గురువారం రాత్రే ఢిల్లీ చేరుకున్న కిరణ్ కుమార్ రెడ్డి ..రాహుల్ అపాయింట్ మెంట్ కోసం చేసి చూశారు. శుక్రవారం మధ్యాహ్నం అపాయింట్ మెంట్ ఇవ్వడంతో రాహుల్ నివాసానికి వెళ్లి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు కిరణ్.
రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం సీఎం పదవికి రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ..అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టుకోవడం..ఎన్నికల్లో దారుణంగా విఫలమవ్వడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. తదనంతరం ఆయన 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
కాగా ఇటీవలే ఆయన ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఉమెన్ ఛాందీతో భేటీ అయ్యారు. చాందీ ఆహ్వానం మేరకు తిరిగి కాంగ్రెస్ లో చేరేందుకు కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతూ వచ్చిన కిరణ్ ..ఈ రోజు రాహుల్ సమక్షంలో తిరిగి కాంగ్రెస్ లో చేరారు.
కిరణ్‌కు సముచిత స్థానం - రాహుల్
కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరిన సందర్భంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ కిరణ్ పార్టీలో చేరికతో రాష్ట్రంలో కాంగ్రెస్ కు లాభం చేకూరుతుందన్నారు. కిరణ్ కు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. నేతలందరూ కలిసి ఎన్నికల కోసం సమయాత్తం కావాలని..ఐక్యంగా పోరాడితే ఏపీలో కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటుందన్నారు. విభజన సమయంలో పార్టీని వీడిన పలువురు నేతలు తిరిగి రావాలని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ గూటికి చేరిన కిరణ్ కుమార్ రెడ్డి