విశాఖలో విషాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ పై చిన్న చిన్న సెక్షన్ల కింద కేసులు పెట్టారన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో అడుగు ముందుకేశారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీని మూసివేయాలని డిమాండ్ చేశారు.
విశాఖ రసాయన గ్యాస్ లేకేజీ ప్రమాదంలో ఆస్పత్రిపాలైన బాధితులకు 6 నెలల తర్వాత వారి జీవితాలు అంధకారమైతే బాధ్యులెవరని ప్రశ్నించారు. బాధితులకు దీర్ఘకాలంలో వచ్చే సమస్యల గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. అంతే కాకుండా ఏపీ సర్కారు.. విశాఖ గ్యాస్ లీకేజీ ప్రమాదాన్ని చాలా తేలిగ్గా తీసుకుందన్నారు.
విషవాయువు గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చాలా తేలిగ్గా మాట్లాడారన్నారు. ఒకవేళ విషవాయువు ప్రమాదకరమైనది కాకపోతే.. ఆర్ఆర్ వెంకటాపురంలో చెట్లు ఎందుకు మాడిపోయాయి..? మూగ జీవాలు ఎందుకు చనిపోయాయి..? అని ప్రశ్నించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.
మరోవైపు విశాఖ గ్యాస్ లేకేజీ ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని చంద్రబాబు కోరారు. ఈ మేరకు ఒక శాస్త్రీయ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. విశాఖ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ప్రధాని మోదీ తీసుకున్న చర్యలను చంద్రబాబు అభినందించారు. వెంటనే NDRF బృందాన్ని అప్రమత్తం చేయడం ద్వారా సత్ఫలితాలు వచ్చాయన్నారు. ప్రమాద తీవ్రత పెరగకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..