తూర్పుగోదావరి జిల్లాను దేశంలోనే తొలి పూర్తి స్థాయి ఎల్ఈడీ వీధి దీపాలు కలిగిన జిల్లాగా ప్రకటించనున్నారు. పంచాయతీరాజ్ దివస్ సందర్భంగా ఈనెల 24న తూర్పుగోదావరిని నూరు శాతం ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేసిన తొలి జిల్లాగా ఏపీ ముఖ్యమంత్రి ప్రకటించనున్నట్లు జిల్లా పంచయితీరాజ్ అధికారులు తెలిపారు. జిల్లాలో కేవలం ఐదు నెలల్లో మొత్తం 3.1లక్షల ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాచేయగా.. ఏటా 34మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఆదా కానుంది.
ఆదివారం సీఎం చంద్రబాబు ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డిలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వీధి దీపాల ఏర్పాటు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈఈఎస్ఎల్ సాయంతో కేవలం ఐదు నెల్లలోనే ఎల్ఈడీ లైట్లను అమర్చి తూర్పుగోదావరి జిల్లాను దేశంలోనే నెంబర్ 1గా నిలిపినందుకు కృషి చేసినవారందరినీ ప్రశంసించారు. ఇతర జిల్లాలకు కూడా ఇలానే లక్ష్యాలను నిర్దేశించుకుని మొత్తం 28-30 లక్షల ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటుచేయాలని సూచించారు. దీని ద్వారా 333 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఆదా అవుతుందన్నారు.