విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో మోపిదేవిలోని ఓ ఆలయంలో భక్తుడు ఐఫోన్ 6ఎస్ ఫోన్ ను హుండీలో వేశాడు. శనివారం ఆలయ సిబ్బంది రోజువారీ హుండీ లెక్కింపు సమయంలో ఈ ఐఫోన్ ను గుర్తించారు.
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయ సిబ్బంది.. భక్తుడు స్మార్ట్ ఫోన్ వ్యాపారాన్ని ప్రారంభించి ఉండవచ్చు. అందుకే విరాళంగా ఐఫోన్ ను దేవుడికి కానుకగా సమర్పించి ఉంటాడని భావిస్తున్నారు.
భక్తుడు దేవునికి స్మార్ట్ ఫోన్ ఇవ్వడం ఆలయ చరిత్రలో ఇదే మొదటిసారి. సిబ్బంది ఈ 'కానుక' విషయం గురించి వెంటనే ఆలయ కార్యనిర్వాహక అధికారి ఎం.శారదా కుమార్ కు తెలియజేశారు.
ఆలయ కమిటీ, ఇప్పుడు ఈ కానుకను తీసుకోవాలా, వద్దా అని కోరుతూ ప్రభుత్వానికి ఓ లేఖ రాయాలని నిర్ణయించింది. దేవాదాయ, ధర్మాదాయశాఖ నిబంధనల ప్రకారం, హుండీలో ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా స్మార్ట్ ఫోన్ లు దొరికితే, దానిని పూడ్చడమో/పాతిపెట్టడమో చేస్తారని ఆలయ సూపరింటెండెంట్ మధుసూదన్ పేర్కొన్నారు.
ఈ ఫోన్ ధర రూ.30వేల పైమాటే అని సిబ్బంది అనుకుంటున్నారు. ఏదేమైనా ఆ భక్తుడు ఎవరో కాని చాలా డిఫరెంట్‌గా, వెరైటీగా ఉన్నాడని సిబ్బంది చర్చించుకుంటున్నారు. దేవుడు కూడా స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తారని అనుకున్నాడేమో గిఫ్ట్ గా ఐఫోన్ 6ఎస్ ను హుండీలో వేశాడు. అంతేకాదు హుండీ లెక్కింపులో విదేశీ కరెన్సీ కూడా ఎక్కువగానే వచ్చాయట.
విజయవాడ నుండి 65 కిలోమీటర్ల దూరంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం ఉంది. భక్తులు చాలా మంది కాలినడకన భగవంతుణ్ణి దర్శిస్తారు. భక్తులు ఆలయంలో పెద్దఎత్తున 'సర్ప దోష నివారణ', 'కేతు దోష పూజ' మరియు 'అనపత్య దోష' వంటి పూజలు నిర్వహిస్తారు. దృష్టి, వినికిడి, చర్మ సంబంధిత లోపాల నివారణ కోసం ప్రార్థనలు చేయడానికి భక్తులు ఈ ఆలయానికి వస్తారు.
విజయవాడలో దేవుడికి 'స్మార్ట్ గిఫ్ట్'