తెలుగు రాష్ట్రాల్లో 'కరోనా వైరస్' ఉద్ధృతి.. ఏ మాత్రం తగ్గడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే 44 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 647కు చేరుకుంది.
మరోవైపు కరోనా వైరస్ ఉద్ధృతిని అడ్డుకునేందుకు లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఐనప్పటికీ వైరస్ లొంగి రావడం లేదు. ఇటు లాక్ డౌన్ రోజులు పెరుగుతున్నకొద్దీ .. రోజు రోజుకు ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతోంది. లాక్ డౌన్ కారణంగా.. ఇప్పటికే 25 రోజులుగా ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. వ్యాపారాలు మూసివేసే ఉన్నాయి. కాబట్టి.. రేపటి (ఏప్రిల్ 20) నుంచి పాక్షిక సడలింపులతో వ్యాపారాలు, పరిశ్రమలు, వ్యవసాయ రంగాలకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించింది.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా రేపటి నుంచి పాక్షిక ఆంక్షలతో సడలింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన జీవో జారీ చేసింది. రేపటి (సోమవారం) నుంచి ప్రభుత్వం గ్రీన్ జోన్ గా గుర్తించిన ప్రాంతాల్లో తగిన రక్షణ చర్యలతో సంస్థలు, పరిశ్రమలు, వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చారు.
ఇందులో భాగంగా రైస్, పప్పు ధాన్యాలు, నూనె మిల్లులకు అనుమతి ఇస్తారు. అలాగే బిస్కట్ తయారీ పరిశ్రమలు, పాల ఉత్పత్తి కేంద్రాలకు అనుమతి ఉంటుంది. సబ్బులు, డిటర్జంట్ల తయారీ పరిశ్రమలకు అనుమతి ఇస్తారు. ఐటీ సంస్థల్లో 50 శాతం ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ పనులు, సాగు నీటి ప్రాజెక్టుల పనులకు అనుమతి ఇస్తారు. ఉద్యోగులను తరలించేందుకు ప్రయివేట్ సంస్థలకు అనుమతి ఇస్తారు. ఐతే వాహనాల్లో పరిమితంగా ఉద్యోగులను మాత్రమే ఎక్కించుకోవాల్సి ఉంటుంది.
రేపటి నుంచి కార్యకలాపాలు నిర్వహించుకోవాలనుకునే సంస్థలు.. తమ సమాచారంతో ప్రభుత్వానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..