'తెలంగాణలో పార్టీ మనుగడ కొనసాగాలంటే పొత్తు తప్పనిసరి. అవసరమైతే ఏ రాజకీయ పార్టీతోనైనా పొత్తు ఉంటుంది. అయితే ఏ పార్టీతో పొత్తు అన్నది సమయం వచ్చినప్పడు నిర్ణయిస్తా' అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. చాలారోజుల తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు.
'తెలంగాణలో పార్టీ పుంజుకుంటే, అందరూ తెలుగుదేశంవైపే వస్తారు. తెదేపాను ఏ పార్టీలోనూ విలీనం చేసే ప్రసక్తే లేదు. అలా చెప్పే హక్కు ఎవరికీ లేదు' అని ఆయన చెప్పారు. తమ కుటుంబం నుంచి ఎవరూ ఇక్కడి రాజకీయాల్లో జోక్యం చేసుకోరని, ఇక్కడి నేతలే రాష్ట్రస్థాయిలో చురుగ్గా పనిచేయాలని చంద్రబాబు తెలంగాణ పార్టీ నేతలు, కార్యకర్తలకు హామీ ఇచ్చారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎల్లకాలం ఉంటుందని, కొందరు నేతలు పార్టీని వీడినా నష్టం లేదని టీడీపీ అధినేత వ్యాఖ్యానించారు.
తెరాసలో తెదేపాను విలీనం చేయాలని చెప్పిన మోత్కుపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కొందరు కార్యకర్తలు కోరారు. తెరాసలో విలీనం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని ఓ పార్టీనేత ఆవేశంగా అన్నారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ పార్టీని విలీనం చేస్తానని చెప్పే హక్కు ఎవరికీ లేదన్నారు. పార్టీ కోసం పోరాడేవారికి తాను అండగా ఉంటానని, అధికార ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టినా భయపడవద్దన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ కోసం డిమాండ్
చంద్రబాబు నాయుడు ప్రసగిస్తున్న సమయంలో కొందరు కార్యకర్తలు, రాష్ట్ర నాయకత్వం చురుగ్గా లేదని, జూనియర్ ఎన్టీఆర్ లేదా బ్రహ్మణి, బాలకృష్ణలకు తెలంగాణ నాయకత్వ బాధ్యతలివ్వాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తూ కోరగా.. చంద్రబాబు నవ్వుతూ కార్యకర్తల్లో ఆవేదన, ఆవేశం ఉన్నప్పుడు ఇలా అడగటం సహజమన్నారు.