అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ఇటీవలే ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో హచ్ చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు అమరావతిలో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా అసెంబ్లీని బహిష్కరిస్తున్నట్లు జగన్ చేసిన వ్యాఖ్యలు, వైసీపీ తీరుపై సోషల్ మీడియాలో ప్రజల నుంచి వచ్చిన స్పందన గురించి చంద్రబాబు ఆరా తీశారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ ను చదివి వినిపించాలని మంత్రి కాల్వ శ్రీనివాసులని చంద్రబాబు కోరారు. అసెంబ్లీని బహిష్కరిస్తే ప్రజలు వైసీపీ నేతలను బహిష్కరిస్తారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారని శ్రీనివాసులు సమాధానం ఇచ్చారు.అలాగే వైసీపీకి ఓట్లు అడిగే హక్కు లేదని నెటిజన్లు వ్యాఖ్యనిస్తున్నారని వెల్లడించారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ చట్టసభలంటే గౌరవం లేని వ్యక్తిని తొలిసారి జగన్ రూపంలో చూస్తున్నామని ..జగన్ తో పాటు వైసీపీ సభ్యులు సభకు రాకపోవడం వల్ల సభకు జరిగే నష్టం ఏమీ లేదని వ్యాఖ్యానించారు.