Amaravathi Rythulu: అమరావతి రైతులు మరో పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఏపీకి ఒక్కటే రాజధాని ఉండాలని..అది అమరావతే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే న్యాయ స్థానం టూ దేవస్థానం అంటూ మహా పాదయాత్ర చేపట్టారు. హైకోర్టు నుంచి తిరుమల వరకు పాదయాత్ర నిర్వహించారు. ప్రభుత్వ బుద్ధి మార్చాలంటూ శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. తాజాగా అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్ర చేపట్టనున్నారు.
అమరావతి ఐకాస సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్ర చేపట్టేందుకు రైతు సంఘ నేతలంతా ఆమోదం తెలిపారు. సెప్టెంబర్ 12 నాటికి అమరావతి ఉద్యమానికి వెయ్యి రోజులు పూర్తి అవుతుంది. ఈసందర్భంగా అదే రోజున పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. అమరావతి ఆవశ్యకతను మరోసారి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తామని రాజధాని రైతులు స్పష్టం చేస్తున్నారు. అమరావతినే ఏకైన రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
గతంలో తిరుమలకు చేపట్టిన పాదయాత్ర సక్సెస్ అయ్యిందని..అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్ర చేస్తామన్నారు. రాజధాని ప్రాంతం నుంచి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల మీదుగా ఉత్తరాంధ్ర వరకు పాదయాత్ర సాగుతుందని అమరావతి రైతులు తెలిపారు. సెప్టెంబర్ 12న రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
అమరావతిపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా..ప్రభుత్వం ఏం పట్టనట్లు వ్యవహరిస్తోందని రైతులు మండిపడుతున్నారు. అమరావతి ఐకాస సమావేశంలో రాజధాని ఐక్య కార్యాచరణ సమితి, అమరావతి పరిరక్షణ సమితి నేతలు, లీగల్ కమిటీ, మహిళా ఐకాస, దళిత ఐకాస నేతలు, దీక్షా శిబిరాల నిర్వహకులు, రైతులు, మహిళలు భారీగా పాల్గొన్నారు. మరోవైపు ఏపీ రాజధాని ఏదన్న దానిపై ఇంత వరకు క్లారిటీ లేదు.
2014లో రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉంటుందని విభజన చట్టంలో పేర్కొన్నారు. ఐతే రాజకీయ కారణాలతో అప్పటి సీఎం చంద్రబాబు అమరావతి కేంద్రంగా పాలన సాగించారు. గుంటూరు, కృష్ణా జిల్లాలను కలుపుకుని సీఆర్డీఏను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాన్ని అమరావతిగా నామకరణం చేశారు. వెలగపూడిలో సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలు పూర్తి అయ్యాయి.
ఆ తర్వాత 2019 ఎన్నికలు రావడం..వైసీపీ ప్రభుత్వం ఏర్పటైంది. అప్పటి నుంచి రాజధానిపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఏపీకి మూడు రాజధానులు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. అమరావతి శాసన, కర్నూలు న్యాయ, విశాఖ పరిపాలన రాజధానులుగా ఉంటాయని అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటించారు. ఈమేరకు బిల్లు సైతం పాస్ అయ్యాయి. కానీ శాసన మండలిలో బిల్లు ఆగిపోయింది. దీంతో శాసన మండలిని రద్దు చేస్తూ సీఎం జగన్ ..కేంద్రానికి అసెంబ్లీ తీర్మానాలను పంపారు.
ఇక్కడే మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సీఆర్డీఏ, శాసనమండలిని పునరుద్ధరించింది. రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని..అదే సమయంలో మూడు రాజధానుల కోసం మరో బిల్లు తీసుకొస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఐతే ఇప్పటి వరకు దీనిపై క్లారిటీ లేదు. త్వరలో మూడు రాజధానులపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.
Also read:Stock Markets: స్టాక్‌మార్కెట్లలో లాభాలు ఆర్జించాలనుకుంటున్నారా..అయితే ఇలా చేయండి..!
Also read:Viral Video: రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. కూరగాయల వ్యాపారి కూతురిపై కాల్పులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook