విశాఖ : ఎప్పుడూ అదృష్టం వెన్నంటిపెట్టుకుని ఉండే ఆ ప్రజా ప్రతినిధి ఏమయ్యారు ? మాజీ మంత్రిగానే కాకుండా... కీలక వ్యవహారాల్లో చక్రం తిప్పిన ఆ ఎమ్మెల్యే ఇప్పుడు ఎక్కడున్నారు ? అవును ఇప్పుడు మంత్రి అవంతి శ్రీనివాస్ ( AP minister Avanthi Srinivas ) వేస్తున్న ప్రశ్నలివే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతగా.. ఓ మంత్రిగా అవంతి శ్రీనివాస్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ ప్రయోజనం కోసమేనని అనుకున్నా... వాస్తవానికి కూడా ఇప్పుడు చాలామందికి వస్తున్న సందేహాలివేని అనిపిస్తోంది. బహుశా అందుకే ఏపీ మంత్రి అవంతీ శ్రీనివాస్ సైతం ఈ వ్యాఖ్యలు చేశారేమో. ఇంతకీ ఎవరిని ఉద్దేశించి మంత్రి అవంతీ ఈ వ్యాఖ్యలు చేశారో తెలుసుకోవాలంటే.. ఇదిగో ఈ డీటేల్స్ తెలుసుకోవాల్సిందే.
దేశమంతా కరోనా సంక్షోభంలో తల్లడిల్లుతున్న సమయంలోనే విశాఖలో జరిగిన గ్యాస్ లీకేజ్ కలవరం రేపింది. 12 మంది ప్రాణాలను బలిగొంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ఊసే లేదేంటని కొంతమంది సందేహం వ్యక్తంచేశారు. కనీసం రాజకీయ ప్రత్యారోపణల్లోనూ ఆయన ప్రస్తావన ఎక్కడా రాలేదు. ఇవాళ మీడియా సమావేశంలో మంత్రి అవంతి శ్రీనివాస్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ... టీడీపీ అధినేత చంద్రబాబు, గంటా శ్రీనివాస్‌లపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హ్యాండ్ కర్చీఫ్ మార్చినట్టు పార్టీలు మార్చే మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఏమయ్యారని మంత్రి అవంతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. అవంతి చేసిన వ్యాఖ్యలతో గంటా రాజకీయ సన్యాసం తీసుకున్నారంటూ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు బలం చేకూరినట్టైంది.
ప్రతిపక్షనేత చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావులు రాజకీయ వ్యాపారులని మంత్రి అవంతి విమర్శించారు. రెండు నెలల పాటు తెలంగాణలో మనవడితో ఆడుకున్న చంద్రబాబుకు స్వాగతం పలకాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు... ఏం ఘనకార్యం చేశావంటూ మంత్రి అవంతి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలు తగ్గించాలని ప్రయత్నిస్తుంటే... బ్రాండ్లు అమ్ముడుపోవడం లేదంటూ బాధపడిపోతున్నారని మంత్రి అవంతి ధ్వజమెత్తారు. కేవలం ఆదాయమే లక్ష్యంగా చంద్రబాబు జనానికి మందుపోయించారని విమర్శించారు. ఏడాది కాలంలోనే ఇచ్చిన హామీల్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగనేనని అవంతి స్పష్టం చేశారు.