అమరావతి: దేశంలోనే మొట్టమొదటి రివర్స్ టెండరింగ్ ప్రక్రియ విజయవంతమైందని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనుల్లో రివర్స్ టెండరింగ్ ద్వారా గతంతో పోల్చుకుంటే మొత్తం రూ. 290 కోట్ల పనుల్లో దాదాపు రూ. 58 కోట్లు ఖజానాకు ఆదా అయ్యాయని అన్నారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో మాక్స్ ఇన్ఫ్రా కంపెనీకి ఈ పనులు కట్టబెడితే, తాజాగా అదే కంపెనీ వాళ్లు 15.7 శాతం తక్కువ ధరకు టెండర్లు వేసి మళ్లీ అదే పనులను దక్కించుకున్నారని మంత్రి వివరించారు. ఇకపై సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి మరిన్ని టెండర్లలో ఇదే తరహాలో రివర్స్ టెండరింగ్ చేపడతామని అనిల్ కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రివర్స్ టెండర్లలో విజయం సాధించి దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. శుక్రవారం రివర్స్ టెండరింగ్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ అనిల్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టిన మంత్రి అనిల్ కుమార్.. గతంలో చంద్రబాబు సర్కారు ప్రాజెక్టు పనుల్లో కమీషన్లు తీసుకోవడంపై చూపించిన శ్రద్ధ.. ప్రాజెక్టు ముంపు బాధితులను ఆదుకోవడంపై కనబర్చలేదని, వారికి పరిహారం కూడా చెల్లించలేదని తెలిపారు. రూ. 300 కోట్ల పనుల్లో రూ. 60 కోట్లు ఆదా అయిందంటే.. ఈ లెక్కన గత ప్రభుత్వం ప్రాజెక్టుల్లో ఎంత అవినీతికి పాల్పడిందో అర్థమవుతోందని మంత్రి అనిల్ కుమార్ ఆరోపించారు.