ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) శాసన వ్యవస్థ ( legislative )కు..న్యాయవ్యవస్థ ( Judiciary ) కు ప్రఛ్ఛన్నయుద్ధం ప్రకటితమైపోయిందా.. పరిస్థితులు అదే స్పష్టం చేస్తున్నాయా..అసలేం జరుగుతోంది.. దేశ చట్టాల్ని చేసే అత్యున్నత వేదిక సాక్షిగా పోరాటం ఉధృతం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఏపీలో ఇప్పుడు శాసనవ్యవస్థ వర్సెస్ న్యాయవ్యవస్థగా మారింది పరిస్థితి.
ఏపీ అమరావతి భూముల కుంభకోణం కేసు ( Amaravati land scam ) పలు ఆసక్తికర, అసాధారణ నిర్ణయాలకు దారి తీస్తోంది. శాసనవ్యవస్థలో న్యాయవ్యవస్థ చొరబడుతోందంటూ వస్తున్న విమర్శల్ని నిజం చేస్తుందంటూ నిపుణుల వాదన ప్రారంభమైంది. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రంలో ఇప్పుడు శాసనవ్యవస్థ వర్సెస్ న్యాయవ్యవస్థగా ( Legislative versus Judiciary ) మారిందనవచ్చంటున్నారు విశ్లేషకులు.
అసలేం జరిగింది
టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అమరావతి భూముల కుంభకోణం కేసులో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ( Ex AG Dammalapati Srinivas ), సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి ఇద్దరు కుమార్తెలపై ఏసీబీ నమోదు చేసిన కేసులపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. అసలు విచారణే జరపకూడదంది. అంతేకాకుండా ఎఫ్ ఐఆర్ ను ఏ మీడియా కూడా ప్రచురించకూడదని ఉత్తర్వులిచ్చింది.
ఇప్పుడు దీనిపై సర్వత్రా అంటే దేశవ్యాప్తంగా రాజ్యాంగ నిపుణులు, రాజకీయ ప్రముఖులు, న్యాయకోవిదులు తప్పుబడుతున్నారు. హైకోర్టు ( High court )ఇలాంటి తీర్పు ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేకమనే వాదనలు పెరుగుతున్నాయి. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ఈ అంశంపై పోరు తీవ్రం చేసింది. దేశ చట్టాలు నిర్మితమయ్యే పార్లమెంట్ సాక్షిగా పోరాటం కొనసాగిస్తోంది. టీడీపీ తరపున గతంలో వాదించిన న్యాయవాదులే న్యాయమూర్తులయ్యారంటూ లోక్ సభ సాక్షిగా వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలే చేశారు. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ.. శాసన వ్యవస్థలోకి చొచ్చుకు వస్తోందని.. శాసన వ్యవస్థ నిర్మాణం నెమ్మది నెమ్మదిగా నాశనం అవుతోందని చెప్పుకొచ్చారు.
ఇంకా పలు కీలక విషయాల్ని వైసీపీ ఎంపీలు పార్లమెంట్ ( Parliament )లో ప్రస్తావించారు. న్యాయమూర్తుల ఎంపికలో న్యాయమైన చర్చ జరగాలని.. తీర్పులు సక్రమంగా లేవని విమర్శించారు. న్యాయవ్యవస్థ, శాసనవ్యవస్థ మధ్యన పలుచని రేఖ ఉందని...శాసనవ్యవస్థ అధికారాల్లో న్యాయవ్యవస్థ చొచ్చుకురాకూడదని తెలిపారు. దేశం అభివృద్ధి మార్గాన పయనించాలంటే మొత్తం కొలీజియం వ్యవస్థనే తొలగించాలని కోరారు.
ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఏపీ హైకోర్టు తీర్పు అనేక ప్రశ్నలకు కారణమవుతోంది. ప్రభుత్వాల పరిపాలనా అధికారంలోకి ప్రవేశించి కోర్టులు అనవసర జోక్యం చేసుకుంటున్నాయనే భావన బలపడుతోందంటున్నారు విశ్లేషకులు. కోర్టుల గౌరవాన్ని ఈ ప్రక్రియ పెంచదని చెబుతున్నారు. కోర్టులనేవి ఎప్పుడూ ప్రజల హక్కుల గురించే పోరాడాలి తప్ప, రాజకీయపరమైన అంశాలలోకి వెళ్లకూడదని సూచిస్తున్నారు న్యాయ నిపుణులు.
మరోవైపు న్యాయ వ్యవస్థను ప్రశ్నించకూడదు.. విమర్శించకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేదనే వాదన ఈ సందర్భంగా ప్రస్తావనకొస్తోంది. ప్రశ్నించడం కోర్టు ధిక్కారం కూడా కాదని..ఎంపీలు పార్లమెంటు లోపల మాట్లాడిన అంశాలపై ఏ కోర్టు కూడా ప్రశ్నించడానికి వీల్లేదని న్యాయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రశ్నించడమనేది శాసన వ్యవస్థ రాజ్యాంగ బద్ధ అధికారమని..గతంలో కోర్టుల తీర్పులను ప్రశ్నిస్తూ పార్లమెంట్ కొత్త చట్టాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.
ప్రభుత్వమైనా, న్యాయవ్యవస్థ అయినా సరే స్వాతంత్యానంతరం నిర్మించుకున్న రాజ్యాంగం ప్రకారమే నడవాలనేది అంతిమ విషయం. గత ప్రభుత్వ నిర్ణయాల్ని సమీక్షించకూడదని..విచారణ జరపకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేదంటున్నారు విశ్లేషకులు. అవసరమైతే గత ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేయవచ్చనేది శాసన వ్యవస్థకు రాజ్యాంగం ఇచ్చిన హక్కని అంటున్నారు.
ఎవరేమన్నారు
ప్రజా ప్రయోజన సమాచార వ్యాప్తికి సంకెళ్లు వేయడమనేది ఇప్పుడు హైకోర్టుల వంతైంది. ఇన్సైడర్ సమాచారంతో అమరావతిలో భూములు కొనుగోలు చేసిన వారికి వ్యతిరేకంగా నమోదైన ఫిర్యాదు దీనికొక ఉదాహరణ. ఇప్పుడు ఏపీ హైకోర్టు ఈ కేసును మీడియా ప్రచురించరాదని, ప్రసారం చేయరాదని నిషేధం విధించింది.
- బీజేపీ ఎంపీ, న్యాయవాది సుబ్రమణియన్ స్వామి
గత ప్రభుత్వాల విధానాలను సమీక్షించకూడదని కోర్టులు అంటే ఎలా? విశృంఖల అధికారాలనేవి ప్రభుత్వాలకే కాదు కోర్టులకు కూడా లేవని మాజీ ఎమ్మెల్సీ, రాజ్యాంగ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పష్టం చేశారు. మాజీ అడ్వకేట్ జనరల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని చెబుతున్న కేసును దర్యాప్తు చేయొద్దని.. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను మీడియా ప్రచురించొద్దని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు అసాధారణమని.. దురదృష్టకరమని చెప్పారు. అసలు అవకతవకలు జరగలేదని హైకోర్టు ఎలా సర్టిఫికెట్ ఇస్తుందని ప్రశ్నించారు. అవినీతి జరిగిందన్న ఆరోపణపై విచారణ జరుగున్నప్పుడు ఆ ఆరోపణలను కోర్టులు విచారణ స్థాయిలోనే అడ్డుకుంటే ఎలా అని ప్రశ్నించారు.
- ప్రొఫెసర్ కే నాగేశ్వర్
భారతదేశ మాజీ కేంద్రమంత్రి దివంగత అరుణ్ జైట్లీ ( Arun Jaitley )కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించడం గుర్తు తెచ్చుకోవాలి. 2016లో ఆర్ధిక బిల్లును ప్రవేశపెడుతున్న సందర్బంగా అరుణ్ జైట్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థ..శాసన వ్యవస్థలోకి చొచ్చుకువస్తోంది.. క్రమక్రమంగా ఇటుకపై ఇటుక పేర్చినట్టుగా.. భారత శాసన వ్యవస్థ స్వరూపం నాశనమైపోతోందని ఆయన చెప్పారు.
- మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి దివంగత అరుణ్ జైట్లీ
ఇప్పుడు సరిగ్గా ఆయన చెప్పినట్టే ఆంధ్రప్రదేశ్లో జరుగుతోందని వైసీపీ నేతలు, మేధావులు వాదిస్తున్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దర్యాప్తును ఏపీ హైకోర్టు నిలిపివేసింది. సమాచార ప్రచురణ, ప్రసారాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ అడ్వొకేట్ జనరల్, ఓ న్యాయమూర్తి కుటుంబ సభ్యుల పేర్లున్న ఏసీబీ కేసు ( Acb case ) దర్యాప్తుపై కోర్టు స్టే ఇవ్వడం దీనికి ఉదాహరణగా చెబుతున్నారు.
హైకోర్టు నిర్ణయంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఏపీ హైకోర్టు దృష్టికొచ్చినట్టుగా అదే కోర్టులో జరిగిన మరో పరిణామం రుజువు చేస్తోందని న్యాయ విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో పాలన చేస్తోంది ఎవరో తెల్చాలని ఏజీ అడిగిన ప్రశ్నకు...మమ్మల్ని ఉద్దేశించి అంటున్నారా..రాష్ట్రంలో పాలిస్తున్నది హైకోర్టునా లేదా ప్రభుత్వమా అని అడగదల్చుకున్నారా అని కోర్టు స్వయంగా ప్రశ్నించడమే దీనికి ఉదాహరణ అంటున్నారు.