Face Recognition: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే సిబ్బంది సమయపాలన పాటించకపోవడం, కొన్ని సందర్భాల్లో ఆఫీసుకు రాకున్నా పై అధికారుల సహాయంతో తమ హాజరు శాతాన్ని మేనేజ్ చేసుకుంటున్న వారికి ఇకపై ఆ ఆటలు కుదరవు అని ఏపీ సర్కారు తేల్చిచెప్పేసింది. ఇకపై ఉద్యోగుల హాజరు గుర్తింపు కోసం ఫేస్ రికగ్నిషన్ టూల్ పద్ధతిని ఉపయోగించాల్సిందిగా ఏపీ సర్కారు ఆదేశాలు జారీచేసింది.
ఏపీ సచివాలయం, హెచ్ఓడీలు, కలెక్టర్ కార్యాలయాలు సహా అన్ని కార్యాలయాల్లో ఉద్యోగులకు ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి కానుందని తెలుస్తోంది. తొలి దశలో భాగంగా ముందుగా సచివాలయంలో అన్ని శాఖల హెచ్ఓడీలు, జిల్లాల్లో అన్ని శాఖలు, విభాగాల ఉన్నతాధికారులకు వర్తింప చేసి ఆ తరువాత అన్ని కేటగిరిల ఉద్యోగులకు ఇది తప్పనిసరి చేస్తామని ఏపీ సీఎస్ స్పష్టంచేశారు.
ఒక విధంగా ఏపీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం సాహసోపేతమైనదనే చెప్పొచ్చు అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే గతంలో ప్రభుత్వ అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టించి, కఠినమైన నిబంధనలు అమలు చేసిన ముఖ్యమంత్రులకు ఉద్యోగుల నుంచి వ్యతిరేకత ఎదురైన సందర్భాలు ఉన్నాయని. పరిపాలనలో పరోక్షంగా సహాయ నిరాకరణోద్యమం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయనేది వారి అభిప్రాయం.