అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మహిళలు, పిల్లలపై జరుగుతున్న లైంగిక నేరాలను అరికట్టేందుకు చట్టాలకు మరింత పదును పెట్టారు. అత్యాచార ఘటనలు, పిల్లలపై హింసాత్మక ఘటనలను నిరోధించేందుకు చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేయనున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా చట్టానికి కొత్త రూపును అందించి ఆంధ్రప్రదేశ్ దిశా చట్టం-2019గా ప్రవేశపెట్టారు. ఇప్పటి నుంచి మహిళలు, పిల్లలపై నేరాలు జరిగితే సత్వర విచారణ చేపట్టేలా ఈ చట్టాన్ని రూపొందించారు. ఇందుకోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దిశ పేరుతో చట్టాన్ని రూపొందించడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన మహిళా ప్రజా ప్రతినిథులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. మహిళలపై జరుగుతున్న నేరాలపై సత్వరమే స్పందించాల్సిన అవసరం ఉందని వారు ముఖ్యమంత్రిని కోరారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసిన ఏపీ హోం మంత్రి సుచరిత, ఏపీఐఐసి చైర్మన్ రోజా, తదితర మహిళా ప్రజాప్రతినిథులు.. సీఎం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ఆయనకు రాఖీలు కట్టారు.