ప్రధాని మోడీ ముందు సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలు ఇవే

రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం జగన్ ఈ రోజు  ప్రధాని మోడీని కలిశారు.

Last Updated : Aug 6, 2019, 07:30 PM IST
ప్రధాని మోడీ ముందు సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలు ఇవే

పార్లమెంటు కార్యాలయంలో ప్రధాని మోడీతో  ఏపీ సీఎం జగన్ సమావేశమయ్యారు.  45 నిముషాల పాటు సాగిన భేటీలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అనేక అంశాలు చర్చకు వచ్చాయి. ఈ వ్యవధిలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని వివరించిన ముఖ్యమంత్రి జగన్.. ఏపీ అభివృద్ధికి ఆర్థికి సాయం చేయాల్సిందిగా సీఎం జగన్‌ ప్రధానిని కోరినట్టు తెలిసింది.

మా వాటా మాకు ఇవ్వండి

కేంద్ర ప్రభుత్వ పథకాలు, పన్నుల వాట , విభజన బిల్లు అనుసరించి ఇతర రూపాల్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు సంబంధించిన అంశాలను కూడా ప్రధాని మోడీ ముందు ప్రస్తావించిన సీఎం జగన్ .. రాష్ట్రం ఆర్ధిక  పురోగతి సాధించేందుకు సహకరించాలని కోరినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నిధుల్ని మంజూరు చేయాలని కోరినట్లు తెలిసింది.

విభజన హామీల ప్రస్తావన

రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి నడుస్తున్న తీరును ప్రధానికి వివరించిన జగన్...సమస్యలు సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ పున:ర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలు చేయాలని ప్రధాని మోడీని జగన్ కోరారు.

హోదాపై పునరాలోచన

ప్రధానిని, కేంద్రమంత్రులను కలిసిన ప్రతిసారీ తాము ప్రత్యేక హోదా డిమాండ్‌ను వారి ముందు ఉంచుతామని జగన్‌ గతంలో స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో  ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాన్నీ ప్రధాని మోడీ వద్ద ప్రస్తావించి దీనిపై  పునరాలోచన చేయాలని కోరినట్లు సమాచారం

పోలవరం టెండర్ల ప్రస్తావన

పోలవరం టెండర్ల రద్దుతో పాటు రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలపైనా జగన్‌ ప్రధానికి వివరించనున్నట్టు సమాచారం. సీఎం జగన్‌ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఇతర ఎంపీలు ఉన్నారు.  మోదీతో భేటీకి ముందు సౌత్ బ్లాక్‌లో పీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రాతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ బృందం సమావేశమైంది.
 

Trending News