అలిపిరి ఘటనలో నన్ను కాపాడింది ఆయనే: చంద్రబాబు

అలిపిరి ఘటనలో నన్ను కాపాడింది ఆయనే: చంద్రబాబు

Last Updated : Sep 22, 2018, 10:08 PM IST
అలిపిరి ఘటనలో నన్ను కాపాడింది ఆయనే: చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం తిరుపతి, కర్నూలు నగరాల్లో పర్యటించనున్నారు. నేటి పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు ముందుగా తిరుపతి నగరానికి చేరుకున్నారు. తిరుపతి పర్యటనలో రూ.23 కోట్ల వ్యయంతో 150 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించిన నగరవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం నగరంలోని నెహ్రూ మునిసిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. చంద్రబాబు మాట్లాడుతూ.. గతంలో అలిపిరిలో తనపై జరిగిన బాంబు దాడి జరిగిన ఘటనను గుర్తుచేసుకున్నారు. ఆ ప్రమాదం నుండి తన్ను ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారే కాపాడారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అలిపిరి వద్ద 2003 అక్టోబర్ 1న జరిగిన ఘటన అందరికి తెలిసిందే.

అనంతరం మాట్లాడుతూ.. తిరుపతి నివాసయోగ్యమైన నగరంగా తీర్చిద్దుతామని చెప్పారు. తిరుపతి అంటే దివ్యక్షేత్రమే కాదు.. మెడికల్ ఎడ్యుకేషన్ హబ్ అనేలా తీర్చిదిద్దుతామన్నారు. కపిలితీర్ధం నుండి అలిపిరి వరకు వనం ఏర్పాటు చేస్తామన్నారు. డిజిటల్ డోర్ నెంబర్ల విధానాన్ని త్వరలో అమలు పరుస్తామన్న ఆయన.. తిరుపతిని నంబర్ వన్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అనేక జాతీయ రహదారులతో తిరుపతిని అనుసంధానిస్తామన్నారు. ఒకప్పుడు టెక్నాలజీని ప్రోత్సహించిన తాను.. ఇప్పుడు పర్యావరణం, ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నానన్నారు. ప్రకృతి సేద్యం వలన ఆరోగ్యంతో దిగుబడి పెరిగి రైతులు బాగుపడుతారన్నారు. అందరికీ పని కల్పించడం.. ఇల్లు కట్టించి ఇవ్వడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

'ప్రభుత్వ సహకారంతో పెట్టుబడిలేని ప్రకృతి సేద్యం(ZBNF)తో ఆంధ్రప్రదేశ్ రైతులు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం జిల్లాలో 21,716 మంది రైతులకు 98.37 కోట్ల రూపాయల సబ్సిడీ ఇవ్వడం జరిగింది' అని అని చిత్తూరు జిల్లా అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

తిరుపతి పర్యటన ముగించుకొని కర్నూలు జిల్లాకు సీఎం బయల్దేరుతారు. అక్కడ పులికనుమ, గోరుకల్లు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. అలాగే జీఎన్‌ఎస్‌ఎస్‌ హెడ్‌ రెగ్యులేటర్‌ దగ్గర జలసిరికి హారతి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం అవుకు కుడి టన్నెల్‌ ద్వారా 10వేల క్యూసెక్కుల నీటిని గండికోట రిజర్వాయర్‌కు సీఎం చంద్రబాబు విడుదల చేస్తారు.

Trending News