Janasena vs Tdp: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన కలిసి పోటీ చేయడం దాదాపుగా ఖాయమైంది. ఇక రేపోమాపో బీజేపీ వచ్చి చేరనుంది. ఈ క్రమంలో సీట్ల సర్దుబాటు మాత్రం కొలిక్కి రావడం లేదు. ఎన్ని స్థానాలనేది తేలకముందే కొన్ని స్థానాల విషయంలో నాదంటే నాదేననే పంచాయితీ మొదలైంది.
ఏపీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న తెలుగుదేశం-జనసేన మధ్య సీట్ల పంచాయితీ ఇప్పట్లో తెగేలా కన్పించడం లేదు. జనసేనకు స్థూలంగా 25 అసెంబ్లీ, 2-3 ఎంపీ స్థానాలిచ్చేందుకు తెలుగుదేశం ఆలోచన చేస్తోందని తెలుస్తోంది. ఎవరికెన్ని సీట్లనేది తెలియకపోయినా కొన్ని సీట్ల విషయంలో మాత్రం అప్పుడే పంచాయితీ మొదలైపోయింది. మరీ ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని స్థానాల విషయంలో సందిగ్దత ఏర్పడుతోంది. ఎందుకంటే జనసేన సామాజికవర్గం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో తెలుగుదేశం సీనియర్ నాయకులు పోటీలో ఉంటున్నారు. ముఖ్యంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో విషయంలో ఇదే పేచీ తలెత్తుతోంది.
రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ప్రాబల్యం ఎక్కువ. అంతేకాకుండా ఈ స్థానాన్ని తూర్పు గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు, కాపు సామాజికవర్గానికి చెందిన కందుల దుర్గేష్ ఆశిస్తున్నారు. చాలాకాలంగా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. అటు ఆ సామాజికవర్గం సైతం ఆయన అభ్యర్ధిత్వంపై ఆశలు పెట్టుకుంది. అయితే ఇదే స్థానం నుంచి తెలుగుదేశం సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. ఇప్పటికే వరుసగా రెండుసార్లు ఈ స్థానం నుంచి ఆయన గెలుపొందిన పరిస్థితి. ఈసారి కూడా తానే పోటీ చేస్తానని తాజాగా ప్రకటించడంతో వివాదం ప్రారంభమైంది.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నేతలతో రాజమండ్రిలో నిన్న సమావేశమైన జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం రాజమండ్రి రూరల్ నుంచి జనసేన పోటీ చేస్తుందని చెప్పారు. ఆయన ఇలా ప్రకటించారో లేదో దానికి కౌంటర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానాలు చేశారు. ఈసారి కూడా తానే రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తానని, సోషల్ మీడియా ప్రచారం చూసి అధైర్యపడవద్దని కార్యకర్తల్ని కోరారు.
తెలుగుదేశం అవసరం జనసేనకు ఉంది తప్ప..జనసేన అవసరం తెలుగుదేశానికి ఉండకపోవచ్చని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మొత్తానికి రాజమండ్రి రూరల్ స్థానం ఇప్పుడు తెలుగుదేశం-జనసేన మధ్య వివాదం రేపుతోంది.
Also read: AP Politics: బీజేపీతో పొత్తు ఖాయమేనా, టీడీపీ-జనసేన-బీజేపీల్లో ఎవరికెన్ని సీట్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook