Janasena Candidates List: జనసేన జాబితాలో బీసీలకు మొండిచేయి, కాపులకే అందలం

Janasena Candidates List: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో నిలిచే పార్టీలు అభ్యర్ధులతో సిద్ధమౌతున్నాయి. దాదాపు అన్ని పార్టీలు అభ్యర్ధుల్ని ప్రకటించాయి. అధికార పార్టీ తప్ప మిగిలిన పార్టీలు ఇంకొన్ని స్థానాల్లో అభ్యర్ధుల్ని ప్రకటించాల్సి ఉంది. ఈ సందర్భంగా జనసేన జాబితాపై విమర్శలు ప్రారంభమయ్యాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 25, 2024, 04:27 PM IST
Janasena Candidates List: జనసేన జాబితాలో బీసీలకు మొండిచేయి, కాపులకే అందలం

Janasena Candidates List: సాధారణంగా ఏ ఎన్నికల్లో అయినా పార్టీలు సామాజిక సమీకరణాలను పరిగణలో తీసుకుని అభ్యర్ధుల ఎంపిక చేస్తుంటాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం అదే పని చేశాయి. కానీ సామాజిక న్యాయంపై భాష్యాలు చెప్పే జనసేనాని మాత్రం టికెట్ల కేటాయింపులో ఆ సామాజిక న్యాయం పాటించకపోవడం గమనార్హం. అందుకే ఇప్పుడు జనసేన విడుదల చేసిన 18 మందిపై విమర్శలు వస్తున్నాయి. సామాజిక సమతుల్యత ఏదని ప్రశ్నిస్తున్నారు. 

ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం-బీజేపీ-జనసేన కూటమిగా బరిలో దిగుతున్నాయి. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలు లభించాయి. మూడు అసెంబ్లీ స్థానాలు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో జనసేన అభ్యర్ధుల్ని ప్రకటించింది. అయితే అభ్యర్ధుల జాబితా ఏ మాత్రం అవగాహన లేకుండా సామాజిక న్యాయం పాటించకుండా ఉందనే విమర్శలు వస్తున్నాయి. ప్రకటించిన 18 స్థానాల్లో 12 స్థానాలు ఓసీ అభ్యర్ధులకే కేటాయించింది. అనకాపల్లి, నరసాపురం అసెంబ్లీ స్థానాల్ని మాత్రమే జనసేన బీసీలకు ఇచ్చింది. ఊహించినట్టే కాపు సామాజికవర్గానికి పెద్దపీట వేసింది. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపులతో పాటు బీసీలు కూడా గణనీయంగా ఉన్నారు. అందులో శెట్టిబలిజ సామాజికవర్గం బలీయమైనది. ఈ వర్గానికి జనసేన ఒక్క సీటు కూడా కేటాయించలేదు. శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన కాకినాడ మాజీ మేయర్ సరోజ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి అసంతృప్తి వెళ్లగక్కారు. 

మరోవైపు జనసేన కోసం ఇప్పటి వరకూ కష్టపడి పనిచేసిన సీనియర్లను కాదని కొత్తగా పార్టీలో చేరినవారికి స్థానం కల్పించారనే విమర్శలు విన్పిస్తున్నాయి. కోనసీమ జిల్లాలోని రెండు ఎస్సీ నియోజకవర్గాలు రాజోలు, పి గన్నవరంలో కొత్తగా పార్టీలో చేరినవారికే టికెట్లు కట్టబెట్టింది పార్టీ. ఇక బొలిశెట్టి సత్యనారాయణ, కిరణ్ రాయల్, పసుపులేటి హరిప్రసాద్, పంచకర్ల సందీప్, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పోతిన మహేష్, ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణలకు పార్టీ మొండిచేయి చూపించింది. 

మరోవైపు పార్టీ ప్రకటించిన 18 అసెంబ్లీ స్థానాల్లో ఒకే ఒక్క మహిళకు చోటు కల్పించారు. నెల్లిమర్ల నుంచి మాధవి ఉన్నారు. ప్రకటించిన 18 స్థానాల్లో అగ్రభాగం కాపులే ఉన్నారు. ఇక రెండు పార్లమెంట్ స్థానాలు కాకినాడ, మచిలీపట్నం కూడా కాపులకే కేటాయించింది పార్టీ. మొత్తానికి బీసీలకు మొండిచేయి చూపించడం ద్వారా జనసేన సామాజిక న్యాయం పాటించలేదనే విమర్శలు మూటగట్టుకుంటోంది. 

Also read: BRS Loksabha List: తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు బీఆర్ఎస్ 17 మంది అభ్యర్ధుల జాబితా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News