అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘం అధికారులకు మధ్య ఎటువంటి వాతావరణం ఉందో అందరికీ తెలిసిందే. ఇటీవల ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు లభించే వరకు ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతూ వచ్చిన వివిధ శాఖల సమీక్షా సమావేశాలకు ఎన్నికల సంఘం ఆంక్షలు విధిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే ఈనెల 10 జరగనున్న ఏపీ కేబినెట్ సమావేశంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పందించారు. ఎన్నికల కోడ్‌ను అనుసరించే ఏపీ మంత్రివర్గ సమావేశం ఉండాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. ఈ భేటీలో పాల్గొనబోయే నేతలు, అధికారులు ఎవరైనా ఎన్నికల కోడ్ ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని ద్వివేది స్పష్టంచేశారు.
ఇప్పటికే అన్ని పార్టీలకు, అధికారులకు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నియమావళిని తెలిపే పుస్తకాలు పంపామని ఆయన తెలిపారు. తాము పంపిణీ చేసిన పుస్తకాల్లో ఎన్నికల కోడ్ అమలు, ఎన్నికోడ్ ఉల్లంఘనకు సంబంధించి అన్ని వివరాలు సవివరంగా ఉన్నాయని, అవి చదువుకుని, చర్యలు తీసుకోవాలని చెప్పిన ద్వివేది.. ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నట్టయితే, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని వివరించారు.