అమరావతి: నేటి నుంచే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ప్రొటెం స్పీకర్ శంబంగి చిన అప్పలనాయుడు శాసనసభలో సభ్యులతో ప్రమాణం చేయించనుండగా రెండోరోజు సభ్యులందరూ కలిసి స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. అముదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాంను స్పీకర్‌గా అధికార పార్టీ ఎంపిక చేసింది. ప్రతిపక్షం నుంచి పోటీ లేకపోవడంతో స్పీకర్ గా తమ్మినేని ఎన్నిక లాంఛనం కానుందని తెలుస్తోంది. 14వ తేదీనుంచి శాసనమండలి సమావేశాలు కూడా ప్రారంభం కానుండగా అదే రోజు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇ. ఎస్.ఎల్.నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం శాసనసభ వ్యవహారాల కమిటీ (బిఎసి) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎన్నిరోజులు సమావేశాలను నిర్వహించాలి, ఏయే అంశాలను ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చించాలనే అంశాలపై కమిటీ నిర్ణయం తీసుకోనుంది.
పూర్తిస్థాయి బడ్జెట్ కోసం జులైలో ఏపీ అసెంబ్లీ మరోసారి సమావేశం కానున్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న ఈ తొలి సమావేశాలను సాధ్యమైనంత తక్కువ పనిదినాల్లోనే ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు ఆటంకం లేకుండా అసెంబ్లీ పరిసరాల్లో, అసెంబ్లీకి దారితీసే మార్గాల్లో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 1500 మంది భద్రతా సిబ్బంది అసెంబ్లీ సమావేశాలకు భద్రత కల్పిస్తున్నారు.