ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై రగడ రాజుకుంది. అసెంబ్లీలో రెండు రోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రతిపాదిత ప్రకటన .. అగ్గి రాజేస్తోంది. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు .. ఆందోళన బాట పట్టారు. ఏపీ కేపిటల్ అమరావతిపై వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తర్జన భర్జనలు జరుగుతున్నాయి. జగన్ అధికారంలోకి రాగానే .. రాజధానిని మార్చుతారనే ప్రచారం జరిగింది. గతంలో మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్లు ఇందుకు ఊతమిచ్చాయి. ఐతే రాజధానిని మార్చే ప్రసక్తి లేదని . . ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రకటించగానే .. రాజధానిపై మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి. రాజధానిగా ఉన్న అమరావతిని మార్చేందుకే ప్రయత్నాలు మొదలయ్యాయనే ప్రచారం జరుగుతోంది. దీంతో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళనబాట పట్టారు. రెండు రోజులుగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు.
నమ్మి భూములిస్తే .. నట్టేట ముంచుతారా..?
ఏపీ సీఎం జగన్ ప్రకటనతో రాజధానికి భూములిచ్చిన రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తాము రాజధాని కోసం నమ్మి భూములు ఇస్తే .. నట్టేట ముంచుతారా..? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్న అమరావతిని మార్చితే మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసినా . . ఒక్క రాజధాని నిర్మాణానికే అతీగతీ లేదని .. ఇప్పుడు మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారని తుళ్లూరు, వెలగపూడి, మందడం రైతులు ప్రశ్నిస్తున్నారు.
రాజధానిలో బంద్..
రైతుల ఆందోళనకు ప్రతిపక్ష టీడీపీ మద్దతు ఇస్తోంది. రాజధానిని మార్చవద్దని డిమాండ్ చేస్తూ .. టీడీపీ నేతలు రైతులతో కలిసి జాతీయ రహదారిపై బైఠాయించారు. 'మా పై ఎందుకీ పగ' అని రాసి ఉన్న ప్లకార్డులతో నిరసన తెలుపుతున్నారు. ఇవాళ రాజధాని గ్రామాల్లో రైతులు బంద్ పాటిస్తున్నారు. మరోవైపు ఎలాంటి ఉద్రిక్తత ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. నిరసనలు జరుగుతున్న ప్రాంతంలో పోలీస్ యాక్ట్ 30 తోపాటు సెక్షన్ 144 విధించారు. శాంతియుతంగా నిరసనలు చేసుకోవాలని పోలీసులు సూచించారు.