అమరావతి: ఏపీ సర్కార్ లిక్కర్ ధరలను పెంచడం ద్వారా దోపిడీకి పాల్పడుతోందని ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణలపై అధికార పార్టీ ప్రతినిథి అంబటి రాంబాబు స్పందించారు. మద్యం ధర రూ. 70 రూపాయలు పెరిగిందంట. దాంట్లో కూడా దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కానీ రాష్ట్రంలో దశలవారీగా మద్యాన్ని నిషేధిస్తామని మేం ఎన్నికల ముందే ప్రకటించాం. అప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నాల్లో భాగంగానే నూతన మద్యం పాలసీని తీసుకొచ్చాం. లిక్కర్ పట్టుకుంటేనే షాక్ కొట్టేలా చేస్తాం. దశలవారీగా మద్యనిషేధం తెస్తామని చెప్పాం. అదే అమలు చేసి చూపిస్తాం అని అంబటి రాంబాబు పునరుద్ఘాటించారు. శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంబటి రాంబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
కొత్త ప్రభుత్వం అన్నా క్యాంటిన్లను మూసివేయడంతో వాటిపైనే ఆధారపడిన పేద ప్రజలు అల్లాడిపోతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తుండటాన్ని ఈ సందర్భంగా అంబటి రాంబాబు తీవ్రంగా తప్పుపట్టారు. అసలు మీరు అన్నాక్యాంటిన్లు తెచ్చింది ఎప్పుడని ప్రశ్నించిన ఆయన... మీకులా మేము ఎన్నికలకు ముందు పథకాలు తీసుకొచ్చి ప్రజలను మోసం చేయలేం అని అన్నారు.