రైతు భరోసా కావాలా.. ఆధార్ ఇవ్వండి!

ఆధార్ సీడింగ్ చేయిస్తేనే.. వైఎస్ఆర్ రైతు భరోసా

Last Updated : Oct 3, 2019, 07:15 PM IST
రైతు భరోసా కావాలా.. ఆధార్ ఇవ్వండి!

అమరావతి: ఈ నెల 15 నుంచి వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అమలు చేసేందుకు సిద్ధమైన ఏపీ సర్కార్.. అంతకన్నా ముందుగా రైతుల భూమి ఖాతాలకు తప్పనిసరిగా ఆధార్‌ సీడింగ్‌ చేయించుకోవాలనే నిబంధన విధించింది. బోగ్‌స్ ఖాతాలను నిరోధించి, అసలైన అర్హులకు వైఎస్ఆర్ రైతు భరోసా లబ్ధి చేకూరడం కోసమే ప్రభుత్వం ఈ నిబంధన విధించింది. ఈ నేపథ్యంలో ఇటీవలె నియమితులైన గ్రామ వాలంటీర్ల చేత రైతుల భూముల ఖాతాలపై ప్రభుత్వం సర్వే చేయించగా.. ఏడున్నర లక్షల మంది రైతులు తమ భూములకు ఆధార్‌ సీడింగ్‌ చేయించుకోలేదని స్పష్టమైంది. ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం.. ఆధార్‌ సీడింగ్‌ లేని భూములకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకం వర్తించదు. దీంతో క్షేత్రస్థాయిలో వీఆర్‌ఓలు రైతుల వద్దకు వెళ్లి వెబ్‌ల్యాండ్‌ భూమి ఖాతాలకు ఆధార్‌ సీడింగ్‌ చేయించుకునేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ తాజాగా జాయింట్‌ కలెక్టర్లను ఆదేశించింది. 

ఏపీలో ఐదేళ్ల కిందటే వెబ్‌ల్యాండ్‌ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వెబ్‌ల్యాండ్ విధానంలో భాగంగా భూ రికార్డులను డిజిటలైజ్‌ చేసి వెబ్‌ల్యాండ్‌లో నిక్షిప్తం చేశారు. అనంతరం వెబ్‌ల్యాండ్‌లోని సమాచారానికి చట్టబద్ధత కల్పించారు. ఈ క్రమంలోనే ప్రతీ భూమి ఖాతాకు తప్పనిసరిగా ఆధార్‌ సీడింగ్‌ చేయాలన్న నిబంధన విధించినప్పటికీ.. అది పూర్తిస్థాయిలో అమలు కాలేదు. అలా వివిధ కారణాలతో పంట సాగు చేయని రైతులు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన రైతులు తమ భూములకు ఆధార్‌ సీడింగ్‌ చేయించుకోలేదు. 

ఇదే కాకుండా ఆ తర్వాత క్రయ, విక్రయాలు, ఆస్తి హక్కు బదలాయింపుల ద్వారా రికార్డులు మారిన భూములకూ ఆధార్‌ సీడింగ్‌ చేయలేదు. అలాంటి భూములన్నింటికీ తాజాగా ఆధార్ సీడింగ్ చేయించాల్సిందిగా రెవిన్యూ శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.

Trending News