వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆయన జీవిత గమనాన్ని, పార్టీ స్థితిగతుల్ని మార్చేసింది. నవంబర్ 6 నుంచి వైఎస్. జగన్ చేపట్టిన పాదయాత్ర ఆయన రాజకీయ చరిత్రను, అధికారాన్ని కట్టబెడుతుందా..? సరిగ్గా 15ఏళ్ల క్రిందట ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరం. ప్రతిపక్షంలో ఉండి అధికారం కోసం ఎదురుచూస్తున్నజాతీయపార్టీ. 2004 ఎన్నికల్లో అధికారం చేపట్టి..పార్టీకి బలమైన పునాది ఏర్పాటు చేయాలని వైఎస్ కంకణం కట్టుకున్నారు. అలా 2003లో మండువేసవిలో 1,467 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, పెండింగులో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తిచేయడం, జలయజ్ఞాన్ని చేపడతామని హామీ ఇచ్చారు. దీంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004 ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి 40వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. అంతేకాదు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు సాధించి వైఎస్ ముఖ్యమంత్రి పీఠాన్నిఅధిష్టించారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దిశగా అడుగుముందుకేశారు. పాదయాత్ర వలన వ్యక్తిగతంగా వైఎస్.కు మంచి జనాదరణ లభించడమే కాకుండా ఆ తదుపరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడింది.
తండ్రిబాటలో తనయుడు..
ఇప్పుడు వైఎస్ బాటలో ఆయన తనయడు వైఎస్ జగన్ కూడా పాదయాత్రనే నమ్ముకున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ చేతిలో పరాజయం పొంది ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్ నవంబర్ 6 నుంచి పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్రలో 125 నియోజక వర్గాల్లో 180 రోజుల పాటు పర్యటించి వచ్చే ఎన్నికల్లో సీఎం కుర్చీ ఎక్కాలని జగన్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే దాదాపు సగం పాదయాత్ర షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న జగన్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగడుతున్నారు. దీంతో పాటు నవరాత్నాల పేరుతో ప్రజాకర్షణ పథకాలు ప్రకటిస్తున్నారు. కాగా ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. కాగా అటు చంద్రబాబు కూడా అధికారాన్ని నిలుపుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు మొదలెట్టారు..వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మునుపటి కంటే మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. రాజకీయ చాణిక్యుడైన చంద్రబాబు వ్యూహాలను తట్టుకొని జగన్ ఏ మేరకు ముందుకు వెళ్తారనేది ప్రస్తుతం ఉత్పన్నమౌతున్న ప్రశ్న.
అవినీతి మరకే ప్రధాన అడ్డంకి..
పాదయాత్రతో మరి వైఎస్ అధికారం చేపడితే ..జగన్ తన పాదయాత్రతో ముఖ్యమంత్రి అవుతారా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఎందుకంటే చిన్నవయసులో అత్యంత అవినీతిపరుడిగా ఆరోపణలు ఎదుర్కొని 16 నెలల జైలు శిక్ష అనుభవించిన జగన్ బెయిల్ మీద బయటకొచ్చారు. పాదయాత్ర లో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. వచ్చే ఎన్నికల్లో దీన్నే ప్రధాన అస్త్రంగా చేసుకొని వైఎస్ జగన్ పై అధికార పార్టీ విమర్శలు చేసేందుకు సిద్ధమవుతోంది.