రామయ్య కళ్యాణం.. మిగిల్చింది చేదు జ్ఞాపకం..!

ఒంటిమిట్ట రాములోరి కళ్యాణం చూడాలని ఆశగా వచ్చిన ఆ భక్తులకు మరణదేవత ద్వారాలు తెరిచింది. సీతమ్మ పెళ్లి వేడుకలను చూడాలని వచ్చిన ఆ అభాగ్యుల కుటుంబాలకు మాత్రం ఆమె కళ్యాణం చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. 

Last Updated : Mar 31, 2018, 03:58 PM IST
రామయ్య కళ్యాణం.. మిగిల్చింది చేదు జ్ఞాపకం..!

ఒంటిమిట్ట రాములోరి కళ్యాణం చూడాలని ఆశగా వచ్చిన ఆ భక్తులకు మరణదేవత ద్వారాలు తెరిచింది. సీతమ్మ పెళ్లి వేడుకలను చూడాలని వచ్చిన ఆ అభాగ్యుల కుటుంబాలకు మాత్రం ఆమె కళ్యాణం చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఆంధ్రుల భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్టలో శుక్రవారం సీతారాముల కళ్యాణ వేడుకలు జరగగా.. ఆ వేడుకను చూడడానికి వచ్చిన భక్తులు మాత్రం నరకయాతనను అనుభవించారు.

ఒక వైపు సీఎం రాకకు అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా.. కుండపోతగా వర్షం కురవడంతో అశేష భక్త సందోహాన్ని కంట్రోల్ చేయడం పోలీసు యంత్రాంగానికి తలకు మించిన భారమైంది. ఈ క్రమంలో విద్యుదాఘాతం కూడా సంభవించడంతో పాటు వేదిక వద్ద రేకులు ఒక్కసారిగా కూలిపోవడంతో దాదాపు 50 మందికి పైగా గాయాలయ్యాయి. అందులో 40 మందిని హుటాహుటిగా కడప రిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఇలాంటి విషమ పరిస్థితిలో రాములోరి పెళ్లి వేడుకలు జరుగుతూ ఉండగా ఉన్నట్టుండి సంభవించిన విద్యుదాఘాతం వల్ల నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. కళ్యాణ వేదిక వద్ద ఓ మహిళకు ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో ఆమె కన్ను మూసింది. అలాగే రేకులు కూలి మీద పడడంతో బద్వేలుకు చెందిన చెన్నయ్య, వెంగయ్య అనే వ్యక్తులు కూడా మృత్యువాత పడ్డారు. మరో మహిళ కూడా విద్యుదాఘాతానికి గురై మరణించింది. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది పలు విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది.

ముఖ్యంగా భారీగా వర్షం కురుస్తున్నా.. సీఎం భద్రత మొదలైన కారణాల వల్ల భక్తులను వదలకుండా గ్యాలరీల్లోనే ఉంచేయడంతో.. మండపం పైకప్పు విరిగిపోయి పడిపోతున్నా.. భక్తులను వదలకపోవడంతో పోలీస్ డిపార్టుమెంటు కూడా విమర్శలను ఎదుర్కొంది. ఈదురు గాలులు వస్తున్నా.. చలువ పందిళ్లు విరిగిపోయి పడిపోతున్నా.. వరుణుడి ధాటికి మండపం రేకులు ఎగిరెగిరి పడుతున్నా.. భక్తులను తరలించే ప్రయత్నం చేయకపోవడం వల్ల ఇంత ఘోరం జరిగిందని పలువురు వాపోతున్నారు.

ఒంటిమిట్ట ఘటన జరగగానే.. సీఎం చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకు రూ.15 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.3 లక్షలు నష్టపరిహారం ఇస్తామని తెలిపారు. రాములవారి కళ్యాణంలో ఇలాంటి దుర్ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. 

Trending News