గృహ నిర్బంధంలో జింబాబ్వే అధ్యక్షుడు

          

Last Updated : Nov 16, 2017, 09:27 AM IST
    • జింబాబ్వేలో సైనిక పాలన
    • ఇది తిరుగుబాటు కాదు: ఆర్మీ
    • ఆయన బాగానే ఉన్నారు: జుమా
    • భారతీయులు క్షేమం
గృహ నిర్బంధంలో జింబాబ్వే అధ్యక్షుడు

జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాంబేను ఆ దేశ సైన్యం గృహ నిర్బంధంలో ఉంచారు. ఇది తిరుగుబాటు కాదని.. త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆర్మీ జనరల్ ప్రకటించారు. ముగాంబే చుట్టూ శత్రువులు పొంచి ఉన్నారని, వారే మా లక్ష్యమని ప్రకటించారు. ప్రస్తుతం జింబాబ్వే రాజధాని హరారే లో సైన్యం గస్తీ నిర్వహిస్తోంది. నగరంలో ప్రధాన కూడళ్లలో సైన్య శిబిరాలను ఏర్పాటు చేశారు.

దీనికంతటికీ అసలు కారణం అధ్యక్ష పదవి. ప్రపంచంలో అధ్యక్ష పదవి అలంకరిస్తున్న వారిలో అతిపెద్ద వయస్సు ఉన్న వ్యక్తి  రాబర్ట్ ముగాంబే. ఇతని వయసు 93 సంవత్సరాలు. 1980 నుంచి ఆయన అధ్యక్షపీఠం నుంచి దిగలేదు.  వృద్దాప్యం వల్లనో లేక అనారోగ్య సమస్యల వల్లనో.. రాబర్ట్ ముగాంబే తన పదవి నుంచి తప్పుకొని భార్య గ్రేస్ ను అధ్యక్ష పీఠంలో కూర్చోబెట్టాలనుకుంటున్నాడు. అందుకోసం రేసులో ఉన్న జింబాబ్వే ఉపాధ్యక్షుడు ఎమర్సన్ ను పదవి నుంచి తొలగించాడు. ఎమర్సన్ కు ఆర్మీతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ మధ్య ముగాంబే పార్టీ వారికి, ఆర్మీకి మధ్య గొడవలు చోటుచేసుకుంటున్నాయి. దేశంలో రాజకీయ అనిశ్చితి కారణంగా పాలనను సైన్యం చేతిలో తీసుకొనే అవకాశం ఉందని ఆర్మీ కమాండర్ చెప్పగా, ముగాంబే పార్టీ అతనిపై దేశ ద్రోహం ఆరోపణ చేసింది.

అజ్ఞాతంలో ఉన్న ఎమర్సన్  నంగాగ్వా బుధువారం జింబాబ్వే చేరుకున్న మరుక్షణమే సైన్యం ముగాంబే ఇంటిని ముట్టడించారు. ఆయన్ను, ఆయన కుటుంబ సభ్యులను గృహనిర్బంధంలో ఉంచారు. జింబాబ్వే అధికార మీడియాపై ఆంక్షలు విధించారు. ఇదంతా ఎమర్సన్  నంగాగ్వా అధ్యక్ష పీఠం కోసం చేస్తున్నారని పలువురు గట్టిగా అనుమానిస్తున్నారు.  ఇదిలా ఉండగా, ముగాంబే క్షేమంగా ఉన్నారని.. ఆయనతో నేను ఫోన్ లో మాట్లాడానని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జుమా చెప్పారు. ఆయన్ను చూడటానికి జింబాబ్వేకు తమ దేశ రక్షణ మంత్రిని పంపిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

భారతీయలు క్షేమం

జింబాబ్వేలో భారత పౌరులందరూ సురక్షిత ప్రదేశాల్లో క్షేమంగా ఉన్నారని  హరారేలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.

Trending News