ఉగ్రదాడులకు కారణాన్ని వెల్లడించిన శ్రీలంక సర్కార్

ఉగ్రదాడులపై శ్రీలంక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది

Last Updated : Apr 23, 2019, 07:41 PM IST
ఉగ్రదాడులకు కారణాన్ని వెల్లడించిన శ్రీలంక సర్కార్

శ్రీలంకలో ఉగ్రమూకలు రెచ్చిపోయి నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. పవిత్ర ఈస్టర్‌ రోజున ప్రసిద్ధ చర్చిలు, విదేశీయులు ఎక్కువగా ఉండే స్టార్‌ హోటళ్లను లక్ష్యంగా  ఉగ్రమూమల జరిపిన ఈ భీభత్సవంలో 321 మంది అమాయకులు బలయ్యారు. కాగా ఈ దాడిలో  500 మందికిపైగా  గాయాలపాలైయ్యారు. నరమేధం సృష్టించిన ఈ దాడి వ్యవహారంపై విచారణ జరిపేందుకు అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రత్యేక కమిటీని నియమించారు. ఘటనపై విచారణ జరిపిన కమిటీ తన ప్రాధమిక రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించింది

దాడికి కారణం ఇదే...

తాజా ఘటనపై విచారణ జరిపిన ఈ కమిటీ...న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చిలో రెండు మసీదులపై జరిగిన దాడికి ప్రతీకారంగానే శ్రీలంకలో చర్చీలు, స్టార్ హోటళ్లను ఉగ్రమూకలు లక్ష్యంగా చేసుకున్నాయని ప్రాథమికంగా నిర్ధారించింది . ఈ విషయాన్ని ఆ దేశ రక్షణశాఖ సహాయ మంత్రి రువన్ వజవర్ధన్ పార్లమెంటుకు తెలిపారు. న్యూజిలాండ్ లో ఈ ఏడాది మార్చి 15న క్రైస్ట్ చర్చ్ లో ఉన్న రెండు మసీదులపై శ్వేతజాతి క్రైస్తవ మతస్తుడు అయిన బ్రెంటన్ టర్రంట్ తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ప్రార్థనలు చేసుకుంటున్న 50 మంది ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగానే ఉగ్రమూకలు శ్రీలంకలో ఈస్టర్ రోజున అమాయకులను లక్ష్యంగా తీసుకున్నట్లు శ్రీలంక ప్రభుత్వం నిర్ధారించింది.
 

దాడులు చేసిందెవరు ?
స్థానిక తీవ్రవాద సంస్థ నేషనల్ తౌహీద్ జమాత్  దాడుల వెనుక ఉన్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రాధమికంగా నిర్ధారించింది. అయితే ఈ సంస్థకు ఐసీఎస్ లాంటి విదేశీ ఉగ్రసంస్థల నుంచి సాయం అందిందా ? అనే కోణంలో విచారణ సాగుతోంది. కాగా ఏడుగురు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడిన నేపథ్యంలో వారితో సంబంధమున్న 40 మంది నిందితులను అరెస్ట్ చేశారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం మరిన్ని నిజాలు వెలుగులోకి రానున్నాయి.

Trending News