ఐన్‌స్టీన్ వందేళ్లక్రితం ఊహించిన ‘సాధారణ సాపేక్షత’ సిద్ధాంతం నిజమని రుజువైంది. గ్రహాంతర భౌతికశాస్త్రంపై పరిశోధనలు జరిపే మాక్స్ ప్లాంక్ సంస్థ నేతృత్వంలోని ‘గ్రావిటీ’ అనే శాస్త్రవేత్తల బృందం ఐన్‌స్టీన్ సిద్ధాంతం నిజమేనని ప్రకటించింది. విశ్వంలో ‘ఎస్2’ అనే నక్షత్రం మే 19న ‘సాజిట్టేరస్’ అనే మహానక్షత్ర కృష్ణబిలానికి అతి సమీపాన వెళ్లిందని ఈ శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ సమయంలో గంటకు 2.5 కోట్ల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు గుర్తించారు. గురుత్వాకర్షణ బలం కారణంగానే ఆ నక్షత్రం.. అంత దగ్గరగా వెళ్లిందని వారు తేల్చారు. సాధారణ సాపేక్ష సిద్దాంతాన్ని ఐన్‌స్టీన్ 1915వ సంవత్సరంలో ప్రతిపాదించాడు.ఈ విషయంపై 1907 నుండి 1915 వరకు పరిశోధనలు చేసాడు.
ఐన్‌స్టీన్ మాటల్లో సాధారణ సాపేక్షసిద్దాంతం: "ఒక్క మాటలో చెప్పాలంటే కాలము, స్థలము, గురుత్వాకర్షణ మూడూ అస్వతంత్రాలు. ఇవి మూల పదార్థం కంటే వేరు కాదు.” ఈ సాధారణ సాపేక్ష సిద్దాంతం వలనే కాలంలో ప్రయాణించవచ్చనే ఊహ బయలుదేరింది.
సాధారణ సాపేక్షతా సిద్ధాంతం రూపంలో ఈ విశ్వానికి ఓ నమూనా నిర్మించటం ద్వారా నక్షత్రాల వెలుగుల వెనకున్న కారణాల నుండి అణుశక్తి వరకూ లెక్కలేనన్ని రహస్యాలను బయటపెట్టేశాడు ఐన్‌స్టీన్.
ఈ రోజుల్లో కార్లలోనూ, మొబైల్ ఫోనుల్లోనూ సాధారణమైపోయిన జీపీఎస్ అప్లికేషన్లకి సమాచారాన్ని చిటికెలో అందించే దిశగా జీపీఎస్ ఉపగ్రహాలను ప్రారంభించారు. ఈ జీపీఎస్ ఉపగ్రహాల్లో ఉండే అణు గడియారాలు సాపేక్షతా సిద్ధాంతం లెక్కగట్టే 'కాలపు నెమ్మదింపుని' పరిగణనలోకి తీసుకుని తరచూ తమ సమయాన్ని సరిదిద్దుకుంటాయి. అవే లేకపోతే ఆ శాటిలైట్లు అందించే దూర సమాచారం గురి తప్పుతుంది. కాబట్టి మీ మొబైల్ ఫోన్ జీపీఎస్ సహకారంతో మీరు చేరాల్సిన గమ్యాన్ని చేరినందుకు ఒక్కసారి ఐన్‌స్టీన్‌కి కృతజ్ఞతలు తెలుపుకోండి.