బ్రిటన్‌ చేరుకున్న ప్రధాని మోదీ; నేడు థెరిసాతో భేటీ

వాణిజ్య పెట్టుబడులు, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా యురప్‌ దేశాల్లో పర్యటిస్తున్న భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ బ్రిటన్ చేరుకున్నారు.

Last Updated : Apr 18, 2018, 08:36 AM IST
బ్రిటన్‌ చేరుకున్న ప్రధాని మోదీ; నేడు థెరిసాతో భేటీ

వాణిజ్య పెట్టుబడులు, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా యురప్‌ దేశాల్లో పర్యటిస్తున్న భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ బ్రిటన్ చేరుకున్నారు. యూకే విదేశాంగ కార్యదర్శి బోరిస్ జాన్సన్ లండన్ లోని హెత్రో విమానాశ్రయం వద్ద మోదీకి స్వాగతం పలికారు. నేడు మోదీ 10 డౌనింగ్ స్ట్రీట్లో బ్రిటిష్ ప్రధాన మంత్రి థెరీసా మేతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేత సమావేశంలో పాల్గొంటారు. ఇరువురు నాయకులు విభిన్న సమస్యలపై చర్చించనున్నారు. వీటిలో వేర్పాటువాదం, సరిహద్దు తీవ్రవాదం, వీసాలు మరియు ఇమ్మిగ్రేషన్ ఉన్నాయి.

ఆతరువాత '5000 ఇయర్స్ ఆఫ్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఎగ్జిబిషన్' ను సందర్శించటానికి మోదీ లండన్ లోని సైన్స్ మ్యూజియానికి వెళ్తారు. ఇక్కడ మోదీ ఇంగ్లండ్ లో ఉన్న భారతీయ సంతతికి చెందిన ఇతర శాస్త్రవేత్తలు, ఆవిష్కరణకర్తలతో మాట్లాడుతారు. అనంతరం లండన్‌లో ఆయుర్వేద సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ప్రారంభిస్తారు. థేమ్స్‌ నది ఒడ్డున 2015లో మోదీ ఆవిష్కరించిన 12వ శతాబ్దపు లింగాయత్‌ తత్వవేత్త, సామాజిక సంస్కర్త బసవేశ్వరుడి విగ్రహం వద్ద నివాళులర్పించనున్నారు.  ఆతరువాత మరోసారి బ్రిటన్ ప్రధానితో సమావేశమవుతారు.

అనంతరం లండన్‌లోని చారిత్రక హాల్‌ వెస్ట్‌మినిస్టర్‌ నుంచి మోదీ ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయనున్నారు. ఇప్పటికే సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచం నలుమూలల నుంచి మోదీకి వచ్చిన పలు ప్రశ్నలకు ఈ ప్రసంగం ద్వారా సమాధానమిస్తారు. అనంతరం బుధవారం, గురువారం జరిగే 52 సభ్య దేశాలైన చోగం సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు.  బ్రిటన్ ప్రధాని ఇచ్చే అధికారిక డిన్నర్ కు హాజరవుతారు. ఆతరువాత యూకే నుంచి భారత్ కు తిరిగివస్తారు.

Trending News