ఇండో పాక్ యుద్ధంపై జనసేన చీఫ్ పవన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కర్నూలు జిల్లాలో జనసేన నిర్వహించిన ర్యాలీలో పవన్ ప్రసంగిస్తూ... రెండేళ్ల క్రితమే యుద్ధం వస్తునందని కొందరు పెద్దలు తనకు చెప్పారంటూ బీజేపీపై పరోక్షంగా సంచలన ఆరోపణల చేశారు. ఈ వ్యాఖ్యలను ప్రాంతీయ మీడియాతో పాటు జాతీయ మీడియా కూడా ప్రచురించింది. సరిగ్గా ఇదే న్యూస్ పాకిస్తాన్ మీడియా కంటపడింది. పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ పత్రిక డాన్ కూడా పవన్ వ్యాఖ్యలను కోట్ చేస్తూ తన వెబ్ సైట్ లో ప్రచురించింది. ఎన్నికల ముందు యుద్ధం వస్తుందని రెండేళ్ల క్రితమే బీజేపీ నేతలు చెప్పారని అందులో ఉంది.
పవన్ కల్యాణ్ అసలు ఏమన్నారో ఒక్కసారి పరిశీలిద్దాం...ఈ నెల 26న కర్నూలు జిల్లా ఆందోని ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ తీరును ఆయన ఎండగట్టారు. ఈ క్రమంలో పవన్ మాట్లాడుతూ దేశభక్తి భారత దేశ సమగ్రత ఒక్క బీజేపీ హక్కుమాత్రమే కాదు..అది మనందరిదీ.. దేశభక్తి అనేది ఒక్క భారతీయ జనతా పార్టీకి చెందినదిగా వారు చెప్పకుంటున్నారు. బీజేపీ వారు చెబుతున్నట్లు ముస్లింలు ఎవరూ ఇక్కడ దేశ భక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఈ దేశంలో హిందువులకు ఎంత సమానమైన హక్కు ఉందో ముస్లింలకూ అంతే సమానమైన హక్కు ఉంది. భారత దేశాన్ని బీజేపీ వారు ఎంతగా ప్రేమిస్తారో అంతకంటే పది రెట్లు మనం దేశాన్ని మేం ప్రేమిస్తామన్నారు. ఇలా మాట్లాడుతూ... ఎన్నికలకు ముందు యుద్ధం వస్తుందని రెండేళ్ల క్రితమే కొందరు తనకు చెప్పారని సంచలన ఆరోపణలకు చేశారు. మన భారత రాజకీయాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు అని బీజేపీ వైఖరిని ఆయన ఇలా పరోక్షంగా ఎండగట్టారు .
ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీపై విమర్శలు సంధించే క్రమంలో పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని విశ్లేషకలు అభిప్రాయాపడుతున్నారు. అయితే పవన్ గత ఎన్నికల్లో బీజేపీకి అనకూలంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీయే కూటమికి మద్దతుగా నిలిచారు. ఈ నేథప్యంలో ఇండో పాక్ యుద్ధంపై పవన్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.