నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దూబా తన రాజీనామాని సమర్పించారు. నేపాల్ కాంగ్రెస్కు రెండు సార్లు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నికైన షేర్ బహదూర్ మూడు పర్యాయాలు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 2001లో గిరిజా ప్రసాద్ కొయిరాలా రాజీనామా చేశాక, ఆయన స్థానంలో షేర్ బహదూర్ కొత్త ప్రధానిగా నియమితులయ్యారు.
నేపాల్ కమ్యూనిస్టు నాయకుడు మన్మోహన్ అధికారికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో భాగంగా 1994లో నేపాల్ కాంగ్రెస్ షేర్ బహదూర్కి నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఈయన సతీమణి అర్జు రానా దూబాకి భారత్తో మంచి సంబంధాలు ఉన్నాయి.ఆమెకు మహిళా హక్కుల పోరాటయోధురాలిగా మంచి పేరుంది.
తాజాగా రాజీనామా చేసిన షేర్ బహదూర్ స్థానంలో నేపాల్ కమ్యూనిస్టు నేత ఖడ్గా ప్రసాద్ ఓలి నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. రాజ్యాంగ పరమైన మార్పులతో పాటు నూతన పార్లమెంటరీ ఎన్నికల ఫలితాలను అనుసరించి దూబా రాజీనామా చేశారు.