మైక్రోసాఫ్ట్ సంస్థ తమ ఈమెయిల్ సర్వీసు వాడుతున్న భారతీయ వినియోగదారుల బ్యాంకింగ్ విషయాలను అమెరికా ప్రభుత్వానికి చేరవేస్తోందని పలు పత్రికలు వార్తలు రాయడం గమనార్హం. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 క్లౌడ్ బేస్డ్ ఈమెయిల్ సర్వీస్ వాడే కస్టమర్లు.. ఒకవేళ అదే ఈమెయిల్ సర్వీసును తమ బ్యాంకింగ్ లావాదేవీలకు వాడితే ఆ డేటాను సంస్థ స్టోర్ చేస్తోందని పలువురు అంటున్నారు. ఎందుకంటే.. అమెరికన్ ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వైలెన్స్ యాక్ట్ ప్రకారం మైక్రోసాఫ్ట్ అమెరికన్ సంస్థ కాబట్టి.. అక్కడి ప్రభుత్వం అడిగితే ఎవరి వివరాలైనా ఇవ్వక తప్పదని తెలుస్తోంది.
అదే కనుక జరిగితే మన బ్యాంకింగ్ వివరాలు కూడా అమెరికా ప్రభుత్వానికి ఏ సందర్భంలోనైనా చేరిపోవచ్చని అంటున్నారు పలువురు సైబర్ నిపుణులు. ఆ మధ్యకాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు ఎంక్వయరీలు చేయగా.. కొన్ని ఇండియన్ బ్యాంకులు ఫిర్యాదులతో వచ్చాయి. తమ వినియోగదారుల వివరాలు అమెరికన్ సెక్యూరిటీ మరియు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు చేరుతున్నానని ఆ బ్యాంకులు తెలిపాయని సమాచారం.
ఈ విషయంపై అదనపు వివరాల కోసం మైక్రోసాఫ్ట్ యాజమాన్యాన్ని డీఎన్ఏ పత్రిక సంప్రదించగా.. వారు ఎలాంటి సమాధానం కూడా ఇవ్వకపోవడం గమనార్హం. కానీ ప్రైవసీకి సంబంధించిన విషయాల్లో వినియోగదారుల హక్కులను ఉల్లంఘించరని వారి పాలసీల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ.. ఇందులో పారదర్శకత ఎంత ఉందో చెప్పలేమని పలువురు సైబర్ నిపుణులు అంటున్నారు. మరొక సందర్భంలో మైక్రోసాఫ్ట్ ఇదే విషయం పట్ల స్పందిస్తూ.. లీగల్ వారెంట్ ఉంటే తప్పితే.. తాము వినియోగదారుల డేటాను ఏ ప్రభుత్వానికి కూడా లీక్ చేయమని చెప్పడం గమనార్హం.