జీఈఎస్ 2017 సదస్సుకు సర్వం సిద్ధం

అమెరికా-భారత్ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న 8వ గ్లోబల్ ఇంట్రాప్రెన్యూర్షిప్ సమ్మిట్ (జీఈఎస్) మంగవారం నుండి హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్న హెచ్ఐసీసీలో ప్రారంభం కానున్నది.

Last Updated : Nov 28, 2017, 09:47 AM IST
    • నేటి నుండి మూడు రోజుపాటు జీఈఎస్ సదస్సు
    • సదస్సు ప్రారంభించనున్న ప్రధాని మోదీ
    • దేశ విదేశాల నుంచి 1500 ప్రతినిధులు, 300 మంది పెట్టుబడి దారులురాక
    • ప్రత్యేక ఆకర్షణగా ఇవాంకా ట్రంప్
జీఈఎస్ 2017 సదస్సుకు సర్వం సిద్ధం

అపురూప వేడుకలకు భాగ్యనగరం వేదికైంది. మోదీ మెట్రో రైలు ప్రారంభోత్సవం, ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు (జీఈఎస్), ఇవాంకా ట్రంప్ భాగ్యనగరం రాక, 170 దేశాల నుంచి 1500మంది ప్రతినిధులు, 300 మంది పెట్టుబడిదారులు, స్వదేశం నుండి కూడా కార్పొరేట్ దిగ్గజాలు, మహిళా పారిశ్రామిక వేత్తలు తదితరుల రాకతో హైదరాబాద్ లో సందడే సందడి..! 

గ్లోబల్ సమ్మిట్ 

అమెరికా-భారత్ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న 8వ గ్లోబల్ ఇంట్రాప్రెన్యూర్షిప్ సమ్మిట్ (జీఈఎస్) మంగవారం నుండి హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్న హెచ్ఐసీసీలో ప్రారంభం కానున్నది. ప్రధాని నరేంద్ర మోదీ సాయంత్రం 4:30 గంటలకు సదస్సు ప్రారంభించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్ అమెరికా బృందానికి నేతృత్వం వహిస్తూ..  ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆమె ఈ సదస్సుకు ప్రధాన ఆకర్షణ. సదస్సు ప్రారంభ కార్యాక్రమంలో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రులు నిర్మలాసీతారామన్, సుష్మా స్వరాజ్ హాజరుకానున్నారు.  

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్-  గ్లోబల్ ఇంట్రాప్రెన్యూర్షిప్ సమ్మిట్) లో పరిశ్రమలు, వ్యాపార రంగంలో వస్తున్న మార్పులు, వ్యాపార సామర్థ్యాన్ని పెంచడం, పరిశ్రమల అభివృద్ధి, ప్రధానంగా మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం మొదలగు అంశాలపై దేశ విదేశీ ప్రతినిధులు సూచనలు, సలహాలు చేయనున్నారు. 

జీఈఎస్ సదస్సు పూర్వాపరాలు 

జీఈఎస్ సదస్సు తొలిసారి 2010 లో ప్రారంభమైంది. ఇప్పటివరకు ఈ సదస్సులు 7 చోట్ల-వాషింగ్టన్, ఇస్తాంబుల్, దుబాయ్, మర్రకేచ్, నైరోబీ, కౌలాలంపూర్, సిలికాన్ వ్యాలీ లో జరిగాయి. ప్రస్తుతం 8వ జీఈఎస్ సదస్సుకు తొలిసారి దక్షిణాసియాలోని హైదరాబాద్ నగరం వేదిక కాబోతుంది. 

జీఈఎస్ సదస్సులో పాల్గొనే పారిశ్రామికవేత్తలు వివిధ రకాల భౌగోళిక అంశాలు, పరిశ్రమలు, వ్యాపార విస్తరణ తదితర అంశాల గురించి ప్రసంగిస్తారు. యువత, ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల వ్యాపారాల ఎదుగుదలను ప్రోత్సహించడం, వారికి భద్రత కల్పించే అంశాలపై ఈ సదస్సులో ప్రత్యేక దృష్టి ఉంటుంది. 

మహిళలకు ప్రాధాన్యం 

ఈ సదస్సులో మహిళా పారిశ్రామికవేత్తలకు అందించే ప్రోత్సాహంపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ అంశంపై ఇవాంకా ట్రంప్ మాట్లాడుతారు. ఈ చర్చలో నిర్మలాసీతారామన్ తో పాటు పలు దేశ విదేశీ ప్రతినిధులు పాల్గొంటారు.

Trending News