Transgender Marriage News: ట్రాన్స్జెండర్ను ఓ యువకుడు వివాహం చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. గార్ల మండలం స్థానిక అంజనాపురం గ్రామానికి చెందిన బానోత్ రాధిక (28) డోర్నకల్ మండలం సిగ్నల్ తండాకు చెందిన ధరావత్ వీరు (30) అనే వ్యక్తి ప్రేమించుకున్నారు. గార్ల మండలం మర్రిగూడెం గ్రామంలోని శ్రీ వేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వీళ్లిద్దరూ బుధవారం ఆదర్శ వివాహం చేసుకున్నారు.
బానోత్ రాధిక ట్రాన్స్ జెండర్ కాగా రైల్లో ప్రయాణించే క్రమంలో రాధికకు వీరుకు అనుకోకుండా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా క్రమక్రమంగా ప్రేమగా మారింది. అలా గత రెండు సంవత్సరాలుగా ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకుంటున్న వీళ్లు.. తాజాగా పెళ్లి చేసుకుని వివాహ బంధంతో ఒక్కంటి వారు అయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ట్రాన్స్ జెండర్ అసోసియేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ , సమాజంలో తమని కూడా మనుషులుగా గుర్తించాలి అని సమాజానికి విజ్ఞప్తి చేశారు. ట్రాన్స్ జెండర్ అనగానే తమని చిన్నచూపు చూస్తూ తీవ్ర వివక్షకు గురిచేస్తున్నారని.. తమని కూడా ఒక జాతి కిందే పరిగణిస్తూ ప్రభుత్వం గుర్తించినప్పటికీ.. సమాజంలో కొంతమంది ఇప్పటికీ తమ పట్ల చిన్నచూపు చూడటం మానడం లేదు అని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇలాంటి ఆదర్శ వివాహాలు మరిన్ని జరగాలి అని కోరుకుంటున్నట్టు ట్రాన్స్ జెండర్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు కూడా కల్యాణ లక్ష్మి అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్జెండర్ శోభ, రాధిక, దుర్గ, నందు, రవళి తదితరులు పాల్గొన్నారు.