Kadapa: మనం ఎంత ఎత్తు ఎదిగినా..పుట్టిన ఊరిని మరవకూడదన్నది పెద్దల మాట. ఆ మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నాడో వ్యక్తి. తల్లికి ఇచ్చిన మాట కోసం తన సొంత పొలాన్ని దానం చేశాడు. ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టు పనికి తన సొంత డబ్బును జోడించి..ఇంద్ర భవనంలా తయారు చేయించాడు. జాతికి అంకితం చేయించాడు.
Kadapa: కడప జిల్లా వేముల మండలం వేల్పుల గ్రామానికి చెందిన రైతు బిడ్డ లింగాల రామలింగారెడ్డి. తల్లికి ఇచ్చిన మాట కోసం గ్రామాభివృద్ధికి శ్రీకారం చుట్టాడు. తన పొలాన్ని ప్రభుత్వానికి ఇచ్చాడు. అక్కడే ప్రభుత్వ భవనాల నిర్మాణానికి నాంది పలికాడు. లింగాల రామ లింగారెడ్డి ఆశయానికి సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. దీంతో పనులన్నీ ఆగమేఘాల మీద పూర్తైయ్యాయి. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలన్ని ఒకే ప్రాంగణంలో నిర్మాణమైయ్యాయి. కార్పొరేట్ కార్యాలయాలను తలపించేలా గ్రామ సచివాలయం, వైఎస్ఆర్ క్లినిక్, గ్రంథాలయం, పోస్ట్ ఆఫీస్, సహకార సొసైటీ, డిజిటల్ లైబ్రరి వంటి భవనాలను నిర్మించారు.