విలక్షణమైన నటనా శైలితో తెలుగు సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న పవన్ కళ్యాణ్...అదే శైలిలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న పవన్ ..ఇప్పుడు తెలంగాణలో కూడా అడుగుపెట్టారు. తెలంగాణ గడ్డపై పవన్ పొలిటికల్ స్ట్రాటజీ ఎలా ఉండబోతోందనే అంశంపై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చనడుస్తోంది. తెలంగాణలో పవనిజం ఏ మేరకు పనిచేస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ గడ్డపై పవనిజం పవర్ పై జీ న్యూస్ ప్రత్యేక విశ్లేషణ..చదివి ఆస్వాదించండి మరి.
పవన్ ప్రస్థానం మొదలైందిలా..
మెగా స్టార్ చిరంజీవి సోదరుడిగా... విలక్షణమైన నటన శైలితో తెలుగు సినీ రంగంలో ప్రవేశించారు పవన్ కళ్యాణ్. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో అభిమాన గణం ఉన్న ఈ హీరో 2005లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ ఆరంగేట్రం చేసి.. అప్పటి నుంచి రాజకీయ స్థితిగతులపై తనదైన శైలితో స్పందిస్తూ వస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలైనప్పటి నుంచి మరింత చురుగ్గా క్రియాశీల రాజకీయాల్లో ఉంటూ వస్తున్న పవన్... ఇటీవలే జనసేన పార్టీని స్థాపించి మార్పు కోసం జనసేనానిగా ముందుకువచ్చాడు.
ప్రత్యక్ష రాజకీయాలు..
2019 సార్వత్రిక ఎన్నికల్లో తాను ప్రత్యక్ష రాజకీయ నాయకుడిగా మారనునున్నట్లు ప్రకటించిన పవన్... అప్పటి నుంచి ఏదో ఒక విధంగా ప్రజల్లో కనిపిస్తూ మనుగడ సాగిస్తున్నాడు. తాజాగా అజ్ఞాతవాసి సినిమాలో నటించి, అదీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ఇక పుల్ టైం రాజకీయాలకు పరిమితమవ్వాలని డిసైడ్ అయినట్లుగా ఉన్నారు. అనుకున్నదే తడువుగా తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి తాజాగా రాజకీయ యాత్రను ప్రారంభించాడు.
పవన్ మైనస్ పాయింట్
రాష్ట్ర విభజనతో తెలుగు ప్రజల మధ్య ఆఘాతం పెరగడంతో ఇరు రాష్ట్రాల మధ్య వైరుద్య భావనలు వచ్చాయి. అదే విధంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఏమాత్రం విలువ ఇవ్వకుండా విభజనతో తన గుండె తరుక్కుపోయింది అంటూ వివాదాస్పద వ్యాఖ్యాలపై అప్పట్లో పెను దుమారమే చెలరేగింది. అప్పటి నుంచి ఆంధ్ర ప్రాంత నేతగా ముద్ర వేయించుకున్న పవన్ కళ్యాణ్ కు.. తెలంగాణ లో ఆదరణ ఆశించిన మేర ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రం ఏర్పడి అర్థ దశాబ్ధం కూడా పూర్తి కాకపోవడంతో తెలంగాణ భావజాల ప్రభావం ఇంకా ఉంది. అదేవిధంగా తెలంగాణ ఆత్మగౌరవమే తమ నినాదమంటూ అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ ఉండగా, పవన్ పప్పులేవి ఉడకవనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది.
పవన్‌కు ఇదే ప్లస్ పాయింట్
అయితే తెలంగాణలో బలమైన ప్రతిపక్ష పార్టీలు లేకపోవడంతో, ప్రభుత్వ పాలనపై వ్యక్తమౌతున్న నిరాసక్తి జనసేనానికి అనుకూలంగా ఉన్నప్పటికీ... తెలంగాణ రాష్ట్ర పార్టీని కాదని రాజకీయాలను శాసించే అవకాశం మాత్రం ఉండదనేది జగమెరిగిన సత్యమే.