BJP WITH FILM STARS: మొన్న మెగాస్టార్.. నిన్న తారక్.. నేడు నితిన్! బీజేపీ కాపు, కమ్మ, రెడ్డి కాంబినేషన్ అదుర్స్...

BJP WITH FILM STARS: ఇటీవల కాలంలో బీజేపీ అగ్రనేతలు వరుసగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. పార్టీ కేడర్ లో జోష్ నింపడానికి వస్తున్న కమలం పార్టీ అగ్రనేతలు.. సర్ ఫ్రైజ్ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. అవి కూడా బీజేపీకి బూస్ట్ ఇచ్చేలా ఉంటున్నాయి.

Written by - Srisailam | Last Updated : Aug 27, 2022, 03:13 PM IST
  • తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్
  • టాలీవుడ్ టాప్ హీరోలతో మీటింగ్స్
  • పక్కా ప్లాన్ ప్రకారమే బీజేపీ వ్యూహాలు
BJP WITH FILM STARS: మొన్న మెగాస్టార్.. నిన్న తారక్.. నేడు నితిన్! బీజేపీ కాపు, కమ్మ, రెడ్డి కాంబినేషన్ అదుర్స్...

BJP WITH FILM STARS: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ చేసింది. ఉత్తరాదిని ఉపేస్తున్న కమలం పార్టీ.. దక్షిణాదిలో మాత్రం వికసించడం లేదు. కర్ణాటకలో ప్రస్తుతం అధికారంలో ఉన్నా అత్తెసరు మెజార్టీతోనే ఉంది. వచ్చే ఏడాది జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ చేసిన బీజేపీ.. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. పార్టీ బలోపేతం కోసం ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం చూపగలికే వ్యక్తులను గుర్తించి తమతో కలిసి వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు కాషాయ పార్టీ పెద్దలు.  ఇందులో భాగంగా కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. బీజేపీ వ్యూహాలతో ప్రత్యర్థి పార్టీలు షాకయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఇటీవల కాలంలో బీజేపీ అగ్రనేతలు వరుసగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వీలు ఉన్నప్పుడల్లా తెలుగు రాష్ట్రాలకు వస్తున్నారు. పార్టీ కేడర్ లో జోష్ నింపడానికి వస్తున్న కమలం పార్టీ అగ్రనేతలు.. సర్ ఫ్రైజ్ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. అవి కూడా బీజేపీకి బూస్ట్ ఇచ్చేలా ఉంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని బలమైన సామాజిక వర్గాలను ఆకర్షించడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతల కార్యక్రమాలు ఉంటున్నాయి. గత జూలై నెలలో ఏపీలోని భీమవరంలో పర్యటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరకు హాజరయ్యారు. ప్రధాని పర్యటనకు మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేక ఆహ్వానించారు. భీమవరంలో ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి వేదిక పంచుకున్నారు చిరంజీవి. ఇక ఈనెల 20న తెలంగాణలో పర్యటించారు అమిత్ షా. మునుగోడు బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ రోజు రాత్రి శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పాన్ ఇండియా సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ వచ్చి అమిత్ షాతో సమావేశయ్యారు.  అమిత్ షా-తారక్ సమావేశం తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది. రాజకీయంగా ప్రకంపనలు రేపింది.

తెలంగాణ బీజేపీ జాతీయ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చారు. ఈ సందర్బంగా తెలంగాణలోని పలువురు ప్రముఖులతో ఆయన సమావేశయ్యారు. టాలీవుడ్ టాప్ హీరో నితిన్ కూడా జేపీ నడ్డాను కలిసిన వారిలో ఉన్నారు. ఈ పరిణామం తెలంగాణలో చర్చగా మారింది. నితిన్‌ ను జేపీ నడ్డా ఎందుకు ఆహ్వానించారన్నది ఆసక్తి రేపింది. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం కోసం బీజేపీ పెద్దలు చేపట్టిన కార్యక్రమాలను పరిశీలిస్తే పక్కా ప్లాన్ ప్రకారమే ముందుకు వెళుతున్నారని తెలుస్తోంది. టాలీవుడ్ హీరోలపై ఫోకస్ చేయడం వెనుక బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కాపు, కమ్మ, రెడ్డి బలమైన సామాజిక వర్గాలు. ఇటీవల కాలంలో బీజేపీ అగ్ర నేతలు  నిర్వహించిన సమావేశాలు ఈ సామాజిక వర్గాల చుట్టే తిరుగుతున్నాయి. ముఖ్యంగా సినిమా హీరోల విషయంలో సామాజిక కోణంలోనే కమలం నేతల వ్యూహాలు కనిపిస్తున్నాయి.

జూలైలో భీమవరం వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ.. మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. చిరంజీవి కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి, ఏపీలో కాపులే బలమైన రాజకీయ శక్తిగా ఉన్నారు. తెలంగాణలోనూ కాపుల ఓట్లు బలంగా ఉన్నాయి. ఇక అమిత్ షాను కలిసిన జూనియర్ ఎన్టీఆర్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. ఏపీలో రాజకీయంగా ఇప్పటివరకు కమ్మ వర్గానిదే అదిపత్యం. తాజాగా జేపీ నడ్డాతో సమావేశమైన హీరో నితిన్  తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు. ఆయనది రెడ్డి సామాజిక వర్గం. తెలంగాణతో పాటు ఏపీ రాజకీయాల్లోనూ రెడ్డి వర్గానిది కీ రోల్. ఇలా తెలుగు రాష్ట్రాల్లో బలమైన సామాజిక వర్గాలకు చెందిన ముగ్గురు టాప్ హీరోలే బీజేపీ పెద్దలతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలే  ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కు రాజ్యసభ సీటు ఇచ్చింది బీజేపీ.  బీజేపీ పక్కా వ్యూహంలోనే భాగంగా చిరంజీవి,  జూనియర్ ఎన్టీఆర్, నితిన్ రెడ్డితో కమలం పార్టీ ముఖ్య నేతలు సమావేశం అయ్యారని చెబుతున్నారు.

భీమవరం చిరంజీవి సొంత ప్రాంత కావడం వలనే అల్లూరి విగ్రహావిష్కరణకు ఆహ్వానించామని బీజేపీ చెబుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో నటనకు మెచ్చి ఎన్టీఆర్ ను అమిత్ షా కలిశారని అంటున్నారు. అయితే రాజకీయ ప్రయోజనం లేకుండా మోడీ, అమిత్ షాలు ఎవరిని కలవరనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. చిరంజీవి, తారక్ విషయంలోనూ పొలిటికల్ ఈక్వేషన్స్ ఉన్నాయంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా గురించే అయితే దర్శకుడు రాజమౌళి, మరో నటుడు రాంచరణ్ ని కూడా పిలవాలి కదా అనే ప్రశ్న వస్తోంది. 2009లో టీడిపి కోసం  ప్రచారం చేసినా తారక్ .. కొన్నేళ్లుగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. జూనియర్ మేనత్త పురంధేశ్వరి బీజేపీలో కీలక పదవిలో ఉన్నారు. ఆమెకు ఏపీ పగ్గాలు ఇవ్వబోతున్నారనే ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే తారక్ కు  అమిత్ షా పిలుపు రావడం ఆసక్తికరమే.  మెగాస్టార్ చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ పార్టీ జనసేన ఇప్పటికే బీజేపీకి మిత్రపక్షంగా ఉంది. చిరంజీవి మద్దతు కూడా సంపాదిస్తే కాపుల ఓట్లు గంపగుత్తగా కొట్టేయవచ్చన్నది కమలనాధుల స్కెచ్ గా కనిపిస్తోంది. తెలంగాణలో బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నితిన్ తో గేమ్ మొదలుపెట్టనున్నారనే చర్చ సాగుతోంది.  

Read also: అనసూయ ఆంటీ అన్నా తప్పే అక్కా అన్నా తప్పే.. ఈ పంచాయితీ ఆగేది ఎప్పుడు?

Read also: రెండో రోజు దారుణంగా కలెక్షన్స్.. కానీ హిందీలో మాత్రం అదుర్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News