హైదరాబాద్: ఈ నెల 12న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గండం నుంచి చాలిచాలనట్లుగా వున్న మద్దతుతో ఎలా గట్టెక్కాలా అని తలలు పట్టుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు తాజాగా మరో షాక్ తగిలింది. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు త్వరలోనే టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. దీంతో ఇప్పటికే తమ మిత్రపక్షమైన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీకి మద్దతు ఇస్తారా లేదా అని ఆలోచిస్తున్న కాంగ్రెస్ పార్టీకి సొంత పార్టీ ఎమ్మెల్యేల రూపంలోనే ఊహించని షాక్ తగిలినట్టయింది.
సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే ఆదివాసీలు, గిరిజనుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే విశ్వాసంతోనే తాము కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఇటీవల సీఎం కేసీఆర్ ను కలిసి ఆదివాసీలు, గిరిజనుల విషయంలో ఎప్పటి నుంచో అపరిష్కృతంగా వున్న సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరగా ఆయన అందుకు సానుకూలంగా స్పందించారని ఇద్దరు ఎమ్మెల్యేలు వెల్లడించారు.