హైదరాబాద్: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితాల సరళి ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 17 లోక్ సభ స్థానాలు ఉండగా అందులో టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ ఎంపీ స్థానం మినహా 16 స్థానాల్లో పోటీచేసింది. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో కడపటి వార్తలు అందే సమయానికి టీఆర్ఎస్ 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మరో 4 స్థానాల్లో బీజేపి ముందంజలో వున్నట్టు తెలుస్తోంది.
ఇక ఈ లోక్ సభ ఎన్నికల్లో దేశంలోనే అత్యంత అధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీపడిన లోక్ సభ నియోజకవర్గంగా చరిత్ర సృష్టించిన స్థానం తెలంగాణలోని నిజామాబాద్. పసుపు, చెరుకు పంటలను అధికంగా పండించే ఇక్కడి రైతులు తమ పంటలకు మద్ధతు ధర లభించడం లేదని ఆందోళన వ్యక్తంచేస్తూ ప్రభుత్వంపై నిరసనగా భారీ సంఖ్యలో తమ నామినేషన్స్‌ను దాఖలు చేశారు. అలా సార్వత్రిక ఎన్నికల్లో దేశం దృష్టిని ఆకర్షించిన నిజమాబాద్ లోక్ సభ స్థానంలో విజయం ఎవరిని వరిస్తుందనే ఆసక్తి, ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది. అయితే, తెలంగాణలో 8 స్థానాల్లో ముందంజలో వున్న టీఆర్ఎస్ నిజామాబాద్ లోక్ సభ స్థానంలో వెనుకబడినట్టు తెలుస్తోంది. నిజామాబాద్ లోక్ సభ స్థానంలో బీజేపికి చెందిన అరవింద్ ధర్మపురి 37,000 ఓట్లతో టీఆర్ఎస్ కన్నా ముందంజలో వున్నట్టు ఏఎన్ఐ ప్రచురించిన వార్తా కథనం పేర్కొంది.
లోక్ సభ ఎన్నికల ఫలితాలు: నిజామాబాద్‌లో ఎంపి కవిత పరిస్థితి ఏంటి ?