రంజాన్ సందర్భంగా ప్రతీ షాపుకి వెళ్లి డబ్బులు అడుక్కోవడం కోసం మహబూబ్ నగర్ నుండి హైదరాబాద్‌కి వచ్చిన పలువురు ట్రాన్స్‌జెండర్లను కిడ్నాపర్లుగా భావించి కొందరు స్థానికులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. ఓ ట్రాన్స్‌జెండర్ మరణించింది. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ చాంద్రాయణగుట్ట ప్రాంతంలో కొందరు హిజ్రాలు డబ్బులు అడుక్కుంటుండగా..కొందరు వ్యక్తులు వారిపై దాడిచేశారు.
వేరే రాష్ట్రానికి చెందిన కిడ్నాపర్లు హిజ్రాల రూపంలో వచ్చి పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారని ఓ వాట్సాప్ మెసేజ్ సర్క్యులేట్ అవ్వడమే అందుకు కారణం. శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించి అసలు విషయం తెలుసుకోగా.. ఈ దారుణానికి కారణం వాట్సాప్ మెసేజ్ అని తేలింది.
పోలీసులు వెంటనే దాడి చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి.. గాయపడిన హిజ్రాలను ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో చేర్చారు. ఈ క్రమంలో ఓ హిజ్రా పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా ఆమెను ఎమర్జెన్సీ వార్డుకి షిఫ్ట్ చేయాలని భావించారు. కానీ అంతలోనే ఆమె మరణించింది. తమకు సమాచారం అందిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చామని.. తాము రావడం ఏ మాత్రం ఆలస్యమైనా పరిస్థితి అదుపు తప్పేదని ఈ సందర్భంగా డీసీపీ సత్యనారాయణ తెలిపారు.
ఈ మధ్యకాలంలో వాట్సాప్‌లో ఫేక్ మెసేజ్‌లు సర్క్యులేట్ అవుతున్నాయని, వాటిని నమ్మవద్దని.. ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు కనిపిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి తప్పితే.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని తెలంగాణ డీజీపీ ఎం మహేందర్ రెడ్డి తెలిపారు.