రేషన్ పథకానికీ నగదు బదిలీ..ఒక్కో కుటుంబానికి రూ.800

Last Updated : Oct 27, 2017, 06:48 PM IST
రేషన్ పథకానికీ నగదు బదిలీ..ఒక్కో కుటుంబానికి రూ.800

తెలంగాణ ప్రభుత్వం ఒక్కో వ్యక్తి 6 కిలోల చొప్పున రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. క్షేత్ర స్థాయిలో పరిశీలనలో బియ్యం తెచ్చుకుని అమ్ముకుంటున్న వాళ్లే అత్యధికం ఉన్నారని తేలింది. రేషన్ షాపుల్లో బియ్యం తెచ్చుకుని, కిలో ఎనిమిదికో, పదికో అమ్ముకుంటున్న వాళ్లే అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రేషన్ లబ్దిదారులకూ నగదు బదిలీ  పథకాన్ని వర్తింపజేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. నగదు బదిలీకి అమలుకు  సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని పౌర సరఫరాల అధికారులకు సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

ఒక్కో ఇంటికి రూ.800 ..

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారులు రేషన్ లెక్క తేల్చారు. ప్రస్తుతం ఒక్కో వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున రేషన్ బియ్యం ఇస్తున్నారు. ఐదుగురు వ్యక్తులున్న ఇంటికి నెలకు 30 కిలోల బియ్యం వెళుతుండగా.. దాని బదులు కిలో బియ్యానికి రూ. 26.66 చొప్పున నెలకు రూ. 800 జమ చేయాలని అధికారులు తేల్చారు. ఈ నగదు బదిలీ ప్రక్రియ అమల్లోకి వస్తే తెల్లరేషన్ కార్డు దారులకు ఈ మేరకు నగదు చెల్లించాల్సి ఉంది. 

రేషన్ షాపుల మూసివేత ఆలోచన

ఒకవైపు రేషన్ డీలర్లు తమకు  కమిషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూండటంతో పాటు సరకు కొనుకోలు, సరఫరాకు అధికమొత్తంలో ఖర్చవడం వంటి కారణాల వల్ల  కేసీఆర్ ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. నగదు బదిలీ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా బియ్యం బదులు నగదు బదిలీ అమలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. రేషన్ షాపులను పూర్తిగా మూసేసి, వాటి ద్వారా ప్రజలకు అందే లబ్దిని బ్యాంకుల్లోకి మళ్లించడం ద్వారా అక్రమార్కులకు చెక్ పెట్టవచ్చన్నది సీఎం కేసీఆర్ ఆలోచన. 

Trending News