Congress Six Guarantee Schemes: 16, 17, 18 సెప్టెంబర్ 2023 దేశ రాజకీయాల్లో చరిత్రాత్మకమైనవి అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు, విజయభేరి సభ, కాంగ్రెస్ అభయహస్తం గ్యారంటీ కార్డులను ప్రజలకు చేరవేసే కార్యక్రమాలు ఈ మూడు రోజుల్లో జరిగాయన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్ మీడియాతో మాట్లాడుతూ.. 70 ఏళ్ల తరువాత హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు జరిగాయని అన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను సోనియా గాంధీ ప్రకటించారని చెప్పారు.
"మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతీ నెల రూ.2500, రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించనున్నాం. రైతు భరోసా ద్వారా రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి రూ.15000, వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12000 అందిస్తాం.. గృహ జ్యోతి ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నాం. ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా ఇంటి స్థలంతోపాటు ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు అందించనున్నాం. యువ వికాసం ద్వారా చదువుకునే విద్యార్థులకు రూ.5 లక్షల వరకు సాయం అందించనున్నాం. చేయూత పథకం ద్వారా రూ.4 వేలు పెన్షన్ ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఆరోగ్యబీమా అందించనున్నాం.
వందరోజుల్లో ఈ గ్యారంటీలను అమలు చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌కు ఇక మిగిలింది మరో 99 రోజులే. ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను నెరవేర్చారు. తెలంగాణ తల్లి సోనియమ్మను స్వాగతించాల్సింది పోయి.. బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు రాజకీయ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు. బహురూపు వేషాలు వేస్తూ అడ్డుకోవాలని చూశారు. సోనియాగాంధీ తెలంగాణకు రావడంతో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంల ముసుగులు తొలగిపోయాయి. వీళ్లంతా ఒక్కటే. కాంగ్రెస్ గ్యారంటీలతో బీఆర్ఎస్ నేతలు కకావికలం అవుతున్నారు.
మేం ప్రజలకు ఏం చేస్తామో చెబుతూ ప్రజల్లోకి వెళతాం. గతంలో ఇచ్చిన ప్రతీ హామీని కాంగ్రెస్ నెరవేర్చింది. ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, అర్హులకు పోడు భూముల పట్టాలు, ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేసి చూపించాం. నల్లధనం తెస్తామని, ఉద్యోగాలు ఇస్తామని మోదీ మోసం చేస్తే.. దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు.. అంటూ కేసీఆర్ మోసం చేశారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు.. తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఇచ్చిన హామీలపై చర్చ పెట్టండి.. ఎవరు మాట తప్పారో.. ఎవరు అమలు చేశారో తెలుస్తుంది.." అని రేవంత్ రెడ్డి అన్నారు.
ఇంటింటికి ప్రణాళికలు మారుతున్నట్లే.. రాష్ట్రాల అవసరాల్లో తేడాలు ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం, ప్రజల అవసరాలు, అనుగుణంగానే కార్యాచరణ ఉంటుందని చెప్పారు. జాతీయ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాలని హారీష్ మొండి వాదనలు చేస్తున్నారని.. వెర్రి మాటలు మాట్లాడి తిర్రిగా వ్యవహరిస్తే ప్రజలు చీరి చింతకు కడతారంటూ ఎద్దేవా చేశారు. ధరణిని 100 శాతం రద్దు చేసి తీరతామని స్పష్టం చేశారు. కేసీఆర్ దోపిడీ పాలనను బొంద పెట్టడం ధరణితోనే మొదలు పెడతామన్నారు.
Also Read: World Cup 2023: ప్రపంచకప్‌కు ముందు వన్డేల్లో నెం.1గా నిలిచేదెవరు..? లెక్కలు ఇలా..!
Also Read: Bigg Boss-7 Telugu: రెండో వారం ఎలాంటి ట్విస్టుల్లేవ్.. హౌస్ నుంచి ఆమె ఔట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook