Revanth Reddy Latter: అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ ఏమైంది..? జేపీఎస్ రెగ్యులరైజేషన్‌పై సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి లేఖ

Junior Panchayat Secretary Strike In Telangana: జూనియర్ పంచాయతీ సెక్రటరీలు చేపట్టిన సమ్మెపై స్పందించారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం నిర్లక్ష్యంపై మండిపడుతూ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. వారిని రెగ్యులర్ చేయకుండా వేధించడం సరికాదన్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : May 9, 2023, 03:23 PM IST
Revanth Reddy Latter: అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ ఏమైంది..? జేపీఎస్ రెగ్యులరైజేషన్‌పై సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి లేఖ

Junior Panchayat Secretary Strike In Telangana: జూనియర్ పంచాయతీ సెక్రటరీల రెగ్యులరైజేషన్‌పై సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జూనియర్ పంచాయితీ కార్యదర్శుల పరిస్థితి బానిసల కంటే హీనంగా తయారైందని మండిపడ్డారు. వాళ్ల గొడ్డు చాకిరీ చేయించుకోవడమే తప్ప, వారి హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని గత 12 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు అయినా లేదన్నారు. ఎంత సేపు రాజకీయాలే తప్ప జూనియర్ పంచాయితీ  కార్యదర్శుల గోసను  పట్టించుకునే సోయి లేకుండా పోయిందన్నారు. వారి కష్టంతో రాష్ట్రంలో గ్రామపంచాయితీలకు 79 అవార్డులు వచ్చిన విషయాన్ని మరిచిపోవద్దని.. ఇంత చేసి అవార్డులు తెస్తే వారి సర్వీసులను రెగ్యులర్ చేయకుండా వేధించడం ఎంత వరకు సహేతుకమని అన్నారు. వారి కష్టానికి మీ ప్రభుత్వం ఇచ్చే రీవార్డు ఇదేనా..? అని ప్రశ్నించారు.

'జూనియర్ పంచాయితీ కార్యదర్శుల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చి 2019 ఏప్రిల్ 12న 9,355 మందిని పలు రకాల షరతులను విధించి రూ.100 బాండ్ పేపర్ మీద సంతకాలు తీసుకొని ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. ప్రొబేషనరీ మూడేళ్ల పీరియడ్ 2022 ఏప్రిల్ 11న పూర్తయింది. అయితే వారిని రెగ్యులర్ చేయకుండా ప్రొబేషన్ టైమ్ మరో ఏడాది పెంచుతున్నట్లు సీఎం హోదా మీరు అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఆ సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా ప్రొబేషన్ పీరియడ్ తర్వాత జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేస్తానని మీరు  హామీ ఇచ్చారు. ప్రొబేషన్‌ను ఏడాది పెంచడం కోసం 2022, జూలై 17న తెలంగాణ రెగ్యులరైజేషన్ ఆఫ్ అపాయింట్మెంట్ యాక్టుకు విరుద్ధంగా జీఓ నెం 26 ద్వారా జారీ చేశారు.

పొడిగించిన ఏడాది ప్రొబేషన్ పీరియడ్ కూడా ఈ ఏడాది ఏప్రిల్ 11తో ముగిసింది. అయినా దున్నపోతు మీద వాన కురిసినట్లు  ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేకపోవడంతో దిక్కులేని పరిస్థితుల్లో పంచాయితీ కార్యదర్శులు సమ్మెకు దిగారు. ఇటువంటి సమస్యలను సావధానంగా విని పరిష్కరించాల్సిన ప్రభుత్వమే సమ్మె విరమించి ఉద్యోగాల్లో చేరకుంటే తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడటం మీ దిగజారుడుతనానికి నిదర్శనం.

గ్రామపంచాయతీ పరిధిలో 56 రకాల విధులను అప్పగించి రోజు 10 నుంచి 12 గంటలపాటు జూనియర్ పంచాయితీ కార్యదర్శులతో వెట్టి చాకిరి చేయించుకుంటోంది మీ ప్రభుత్వం. రోజు రోజుకు నిర్వహించాల్సిన బాధ్యతలు పెరగుతుండటం, మితిమీరిన ఒత్తిడితో పంచాయితీ కార్యదర్శులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ఇప్పటికే స్థానిక రాజకీయాల కారణంగా రాష్ట్రంలో దాదాపు 1500 మంది ఉద్యోగాలు వదిలేశారు. ఇతర అనారోగ్య సమస్యలతో 44 మంది వరకు మృతి చెందారు. ఇంత చేస్తున్నా మీ ప్రభుత్వం గ్రామ కార్యదర్శుల రెగ్యులర్ చేసే విషయంపై ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి ఉన్నత స్థానంలో నిలవాలనే ఆశ ఉన్నప్పటికీ తక్కువ జీతమే అయిన వచ్చిన ప్రభుత్వ ఉద్యోగ అవకాశం వదలుకోకూడదని జూనియర్ పంచాయితీ కార్యదర్శి ఉద్యోగంలో చేరారు..' అని రేవంత్ రెడ్డి లేఖ ప్రస్తావించారు.

ఎంతో పనిభారం పెరిగినా భరిస్తూ రెగ్యులర్ చేస్తారని ఆశగా ఎదురు చూశారని.. మూడేళ్ల ప్రొబేషన్ ముగిసిన మరో ఏడాది పొడిగించిన అలస్యంగానైనా న్యాయం జరుగుతుందనే సదుద్దేశంతో దానికి కూడా అంగీకరించి తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించారని అన్నారు. ఇప్పుడు నాలుగేళ్ల ప్రొబేషన్ పీరియడ్ ముగిసిన తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా పంచాయితీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తూ తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందన్నారు. లేనిపక్షంలో వారి పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలవడమే కాక.. వారి తరపున ప్రత్యక్ష కార్యచరణకు సైతం సిద్ధమవుతామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. 

డిమాండ్లు :
==> జూనియర్ పంచాయితీ కార్యదర్శులు కోరుకుంటున్న విధంగా వారి ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలి.
==> 4 సంవత్సరాల సర్వీసులను పరిగణనలోకి తీసుకోవాలి.
==> కేడర్ స్ట్రెంట్ తోపాటు సర్వీసును రూపొందించాలి.
==> 010 పద్దు కింద వేతనాలిస్తూ EHS కార్డులను అందజేయాలి.
==> చని పోయిన పంచాయితీ కార్యదర్శుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించేలా కారుణ్య నియామకాలు చేపట్టాలి.
==> OPS (Out Sourcing Secretary) వారిని కూడా రెగ్యులర్ చేయాలి.
==> ఇతర శాఖల్లోని ప్రభుత్వ మహిళా ఉద్యోగుల మాదిరిగా మహిళా పంచాయితీ కార్యదర్శులకు 6 నెలల ప్రసూతి సెలవులు, 90 రోజుల చైల్డ్ కేర్ సెలవులు ఇవ్వాలి.

Also Read: TS Inter Results 2023: ఇంటర్ ఫలితాలు, మార్కుల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Read: Jangaon MLA Muthireddy Yadagiri Reddy: ప్రత్యర్ధులు నా బిడ్డను ఉసిగొల్పారు.. ఫోర్జరీ కేసుపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి రియాక్షన్ ఇదే..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News