తెలుగు భాషను రక్షించేందుకు ఓ పక్క ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను తీసుకొస్తుంటే.. కళాశాల విద్యాశాఖ మాత్రం తెలుగును తొలగిస్తోంది. అన్ని విద్యాసంస్థల్లో ఇంటర్ వరకు తెలుగును తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరి చేయగా.. కళాశాల విద్యాశాఖ ఏవేవో కుంటిసాకులు చెబుతూ తెలుగును ఎత్తేస్తున్నారు. హైదరాబాద్ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో తెలుగు మీడియాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవడం ఇటీవల చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ కళాశాల విద్యాశాఖ ఇటీవల ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో సీట్ల హేతుబద్దీకరణకు శ్రీకారం చుట్టింది. దీంతో డిమాండ్ ఉన్న చోట అదనపు సీట్లు, కోర్సులు.. లేనిచోట వీటిని తొలగిస్తున్న అధికారులు హైదరాబాద్‌లోని కాలేజీల్లో తెలుగుకు ఆదరణ లేదని తేల్చారు. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిటీ కాలేజీ మినహా హైదరాబాద్ జిల్లా పరిధిలోని అన్ని డిగ్రీ కాలేజీల్లో తెలుగు మీడియం బోధన ఉండబోదు. తెలుగు మీడియం సీట్లు భర్తీ కాకపోతే సీట్లు తగ్గించాలే తప్ప.. ఎత్తివేయడం సమంజసం కాదని పలువురు డిగ్రీ కాలేజీ లెక్చరర్లు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని తెలుగును రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు మీడియం ఎత్తివేత!